సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన మరువక ముందే పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌...

Updated : 30 Jun 2020 10:59 IST

ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర అస్వస్థత

పరవాడ : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన మరువక ముందే పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో అర్థరాత్రి హెచ్‌డీఎస్‌ గ్యాస్‌ను రియాక్టర్‌లోకి పంపుతుడగా లీకైంది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న షిఫ్ట్‌ ఇన్‌చార్జ్‌ రావి నరేంద్ర(33)), కెమిస్ట్‌ గౌరీశంకర్‌(26) మృతిచెందారు. చంద్రశేఖర్‌, ఆనందబాబు, జానకీరావు, సూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

బాధితులను చికిత్స నిమిత్తం గాజువాక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్పపొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ లోపలికి మీడియాను అనుమతించడంలేదు. కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షల నష్ట పరిహారం చెల్లించడంతో పాటు కంపెనీ యజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం: సీపీ
సాయినార్‌ కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీపీ ఆర్‌కే మీనా తెలిపారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సీపీ వెల్లడించారు. ఘటనలో మృతి చెందిన షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి నరేంద్ర స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి, కెమెస్ట్‌ గౌరీశంకర్‌ విజయనగరానికి చెందిన వ్యక్తి అని సీపీ వివరించారు. ప్రస్తుతం గ్యాస్‌ లీకేజీని అదుపు చేశారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్‌ పేలి ఇద్దరు మృతి చెందారని సీపీ తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు