కిల్ల‌ర్ గ్యాంగ్‌స్ట‌ర్: పోలీసులే ఉప్పందించారు..?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కాన్పూర్‌ ఎన్‌కౌంట‌ర్‌లో 8మంది పోలీసులు మృత్యువాత‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉన్న‌ట్లు ద‌ర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్ర‌ధాన నిందితుడైన గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేకు స్థానిక పోలీసులే స‌హాయం చేసిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని స‌మాచారం.

Published : 05 Jul 2020 15:55 IST

అరెస్టు స‌మాచారాన్ని గ్యాంగ్‌స్ట‌ర్‌కు తెలిపిన స్థానిక పోలీసులు?
అప్ర‌మ‌త్త‌మై పోలీసుల‌నే కాల్చివేసిన వికాస్ దూబే
త‌మ‌ సిబ్బంది పాత్రపై యూపీ పోలీసుల ద‌ర్యాప్తు

ల‌ఖ్‌న‌వూ: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కాన్పూర్‌ ఎన్‌కౌంట‌ర్‌లో 8మంది పోలీసులు మృత్యువాత‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉన్న‌ట్లు ద‌ర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్ర‌ధాన నిందితుడైన గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేకు స్థానిక పోలీసులే సాయం చేసిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలినట్లు స‌మాచారం. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో వికాస్ దూబే ముఠా కీల‌క‌స‌భ్యుడు ద‌యాశంక‌ర్ అగ్నిహోత్రీ గాయాల‌పాలై పోలీసుల‌కు దొరికిపోయాడు. అత‌న్ని అరెస్టు చేసి విచారించ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

దాదాపు 60కేసుల్లో నిందితుడిగా ఉన్న‌ క‌రుడుక‌ట్టిన రౌడీషీట‌ర్‌ను ప‌ట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. అయితే, ఈ ప్ర‌త్యేక బృందాలు బ‌య‌లుదేరిన‌ స‌మాచారాన్ని స్థానిక పోలీసులు గ్యాంగ్‌స్ట‌ర్‌కు తెలియ‌జేసిన‌ట్లు ప‌ట్టుబ‌డిన ముఠాలో స‌భ్యుడు ద‌ర్యాప్తులో వెల్ల‌డించాడు. 'వికాస్ దూబేను అరెస్టు చేయ‌డానికి వ‌స్తున్న‌ట్లు స్థానిక పోలీసుస్టేష‌న్‌ నుంచి స‌మాచారం అందింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన వికాస్ దూబే త‌న ద‌గ్గ‌రున్న ఏకే-47తో పోలీసుల‌పై కాల్పులు జ‌రిపాడు' అని ద‌యాశంక‌ర్ ద‌ర్యాప్తు అధికారుల‌కు వివ‌రించాడు. అంతేకాకుండా ఆ స‌మయంలో గ్రామంలో క‌రెంటు కూడా నిలిపివేయాల‌ని స్థానిక పోలీసుల నుంచి విద్యుత్తు కేంద్రానికి ఆదేశాలు వెళ్లినట్లు ద‌ర్యాప్తులో బ‌య‌ట‌ప‌డింది.

దీంతో స్థానిక చౌబేపూర్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ వినయ్ తివారీని స‌స్పెండ్ చేసిన యూపీ పోలీసులు అత‌న్ని విచారిస్తున్నారు. అంతేకాకుండా స్టేష‌న్‌లోని మొత్తం సిబ్బందిపై క‌న్నేసి ఉంచారు. స్థానికంగా ఓ వ్య‌క్తిని చంపేందుకు గ్యాంగ్‌స్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఫిర్యాదు అందిన‌ప్ప‌టికీ స్థానిక ఇన్‌స్పెక్ట‌ర్ విన‌య్ తివారీ కేసు పెట్ట‌డానికి నిరాక‌రించినట్లు తెలిసింది. దీంతో ఆవ్య‌క్తి ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసి అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ సందర్భంగా గ్యాంగ్‌స్ట‌ర్ జ‌రిపిన‌ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా స‌హా ముగ్గురు ఎస్సైలు, న‌లుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘ‌ట‌న‌ను స‌వాల్‌గా స్వీక‌రించిన ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ పోలీసులు నిందితుడి కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. మూడు రోజులైన నిందితుడి ఆచూకి ల‌భించ‌లేదు. తాజాగా అత‌న్ని ప‌ట్టించిన‌వారికి ల‌క్ష రూపాయ‌ల రివార్డును ప్ర‌క‌టించారు. ఉత్త‌ర్ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌ఖ్‌న‌వూకు 150కి.మీ దూరంలో ఉన్న బిక్రూ గ్రామంలో ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. అయితే ఈ మాఫియాకు పోలీసులు గూఢ‌చ‌ర్యం చేసిన‌ట్లు తేలితే క‌ఠినచ‌ర్య‌లు ఉంటాయ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇదిలాఉంటే, గ్యాంగ్‌స్ట‌ర్‌ ఇంటిని అధికారులు కూల్చివేశారు.

ఇవీ చ‌ద‌వండి..
నా కొడుకును కాల్చి చంపండి..!
రౌడీమూక‌ల కాల్పుల్లో 8మంది పోలీసుల మృతి

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని