జీజీహెచ్‌‌లో కొవిడ్‌ ఇంజెక్షన్ల మాయం

గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రి (జీజీహెచ్‌)లో ఔషధాలకూ భద్రత లేకపోవడం విస్మయపరుస్తోంది. ఆస్పత్రి మెడికల్‌ స్టోర్‌ విభాగానికి వార్డుబాయ్‌ ఒకరు ఆదివారం

Published : 22 Sep 2020 08:47 IST

వార్డుబాయ్‌ సస్పెన్షన్‌... విచారణకు ఆదేశం


మెడికల్‌ స్టోర్‌ విభాగం ఇదే

గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రి (జీజీహెచ్‌)లో ఔషధాలకూ భద్రత లేకపోవడం విస్మయపరుస్తోంది. ఆస్పత్రి మెడికల్‌ స్టోర్‌ విభాగానికి వార్డుబాయ్‌ ఒకరు ఆదివారం వెళ్లి అక్కడ పని చేసే ఉద్యోగుల కళ్లుగప్పి ఖరీదైన ఇంజెక్షన్లతో కూడిన బాక్సును పట్టుకుపోయాడు.. అనంతరం దాన్ని ఓ మెడికల్‌ స్టోర్‌లో విక్రయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆసుపత్రి ఉన్నతాధికారులను నివ్వెరపరిచింది. గతంలో ఈ తరహాలో ఇంకెన్ని మోసాలు జరిగాయోనని అనుమానం వ్యక్తం చేశారు.

ఈనాడు-గుంటూరు

రెండేళ్ల క్రితం కాన్పుల వార్డు నుంచి ఇద్దరు శిశువులను రోజుల వ్యవధిలోనే ఎత్తుకుపోయారు.. అప్పట్లో ఆ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత కూడా ఆస్పత్రిలో నిఘా కెమెరాల వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేయలేదనటానికి తాజాగా చోటుచేసుకున్న వార్డు బాయ్‌ ఉదంతమే నిదర్శనం.

ఆస్పత్రిలో మెడికల్‌ స్టోర్‌ విభాగం అత్యంత కీలకమైనది. వార్డుల్లో చికిత్స పొందే ఇన్‌పేషెంట్లకు, శస్త్ర చికిత్స మందిరాలకు అవసరమైన సూది మందులు, ఔషధాలు, సర్జికల్‌ సామగ్రి ప్రతిదీ ఇక్కడి నుంచే చేరతాయి. ఖరీదైన మందులను స్ట్రెచర్లు, చక్రాల కుర్చీల్లో పెట్టుకుని వార్డుబాయ్‌లు, స్టాఫ్‌ నర్సులు తీసుకెళ్తారు. ఇక్కడ కెమెరాలను ఏర్పాటు చేయలేదు.

మెడికల్‌ స్టోర్స్‌ నుంచి వార్డు బాయ్‌ ఇంజెక్షన్ల బాక్సును బయటకు తీసువెళ్లే వరకు అటు భద్రతా సిబ్బంది, ఇటు మెడికల్‌ స్టోర్‌ సిబ్బందికి తెలియకపోవడం గమనార్హం.

కొవిడ్‌ నేపథ్యంలో నిత్యం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి జీజీహెచ్‌ మెడికల్‌ స్టోర్‌కు పెద్దఎత్తున మందుల నిల్వలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆడిట్‌ లేకపోవటంతో ఏం జరిగినా వెలుగుచూడదనే అభిప్రాయంలో యంత్రాంగం ఉంది.

వార్డుబాయ్‌ పట్టుకుపోయిన ఇంజెక్షన్ల బాక్సును లోకల్‌ పర్ఛేజస్‌ కింద ఇటీవల తెప్పించారు. ఒక్కో ఇంజెక్షన్‌ ఖరీదు బహిరంగ మార్కెట్లో రూ.5వేలకు పైగా ఉంది. ఇంత ఖరీదైన మందుల నిల్వలను స్టోర్‌ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఆరుబయటే పెట్టి ఉంచడం గమనార్హం.

సస్పెండ్‌ చేశాం

-ఆచార్య ప్రభావతమ్మ, పర్యవేక్షకురాలు, జీజీహెచ్‌

చేతివాటం ప్రదర్శించిన వార్డుబాయ్‌ను గుర్తించి తొలుత సస్పెండ్‌ చేశాం. ఆ ఘటన ఎలా జరిగిందో నివేదిక ఇవ్వాలని విచారణకు ఆదేశించా. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ప్రైవేటు మెడికల్‌షాపు నిర్వాహకుడు ఏ ఆధారం లేకుండా కొనుగోలు చేయడంపై చర్యలు చేపట్టాలని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం. నిఘా కెమెరాల వ్యవస్థను బలోపేతం చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని