తమ్ముడూ... చనిపోతున్నా!

తమ్ముడూ.. నేను రాయిపల్లి శివారులోని మంజీర వంతెనపై నుంచి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి కనిపించకుండా పోయిన సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రం ...

Updated : 27 Nov 2020 07:26 IST

మంజీర నదిలో దూకిన వ్యవసాయాధికారిణి

మనూరు: తమ్ముడూ.. నేను రాయిపల్లి శివారులోని మంజీర వంతెనపై నుంచి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి కనిపించకుండా పోయిన సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రం ఏవో(వ్యవసాయాధికారిణి) అరుణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మనూరు ఎస్సై నరేందర్‌, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లికి చెందిన అరుణ(34) సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రంలో ఏవోగా పని చేస్తున్నారు. గతంలో నారాయణఖేడ్‌, కల్హేర్‌ తదితర మండలాల్లో వ్యవసాయాధికారిణిగా పనిచేశారు. నాలుగేళ్ల కిందట నాగల్‌గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన శివకుమార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు రుద్రవీర్‌(3), విరాట్‌(11 నెలలు) ఉన్నారు. వీరందరు సంగారెడ్డి పట్టణంలో నివాసముంటున్నారు. గురువారం సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించి ఇంట్లో పని ఉందని కారులో బయల్దేరారు. అక్కడి నుంచి మనూరు మండలం రాయిపల్లి శివారులోని మంజీర నది వద్దకు వచ్చారు. ఆమె తమ్ముడు శివకుమార్‌కు ఫోన్‌ చేసి మంజీర వంతెనపై నుంచి నదిలో దూకి నేను చనిపోతున్నాని చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. తిరిగి శివకుమార్‌ అక్కకు ఫోన్‌ చేసినా కలవకపోవడంతో వంతెన వద్దకు వచ్చి గాలించారు. వంతెనపై సమీపంలోనే అరుణ కారు, పర్సు, ఫోన్‌, చెప్పులు ఉండటంతో మనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మనూరు ఎస్సై నరేందర్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిశీలించారు. నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. మంజీరలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పోలీసులకు గాలించడం కష్టంగా మారింది. అరుణ తమ్ముడు శివకుమార్‌ ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సంఘటన స్థలానికి నారాయణఖేడ్‌ సీఐ రవీందర్‌రెడ్డి చేరుకొని వివరాలు సేకరించారు.

మూడు నెలలుగా మానసిక ఒత్తిడిలో..

మూడు నెలల నుంచి ఏవో అరుణ మానసిక ఒత్తిడిలో ఉందని సంగారెడ్డిలోని వ్యవసాయ కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. బాధ ఏంటో చెప్పమని పదే పదే అడిగినా సమాధానం ఇచ్చేది కాదని తెలిపారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మనుసులో మాట తెలుపలేదన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని