కొలువు కోసం వస్తే... ప్రాణం పోయింది

దేశ రక్షణకు సంబంధించిన కొలువులో చేరాలనే తపనతో తన అక్క వివాహ ముహూర్తాన్నే మార్చుకుని... ఎంపిక పరీక్షలకు హాజరైన ఓ యువకుడు ప్రాణాలొదిలిన ఘటనపై శుక్రవారం మల్కాపురం..

Updated : 28 Nov 2020 09:03 IST

నేవీ ఎంపికల్లో కుప్పకూలిన యువకుడు

విశాఖపట్నం : దేశ రక్షణకు సంబంధించిన కొలువులో చేరాలనే తపనతో తన అక్క వివాహ ముహూర్తాన్నే మార్చుకుని... ఎంపిక పరీక్షలకు హాజరైన ఓ యువకుడు ప్రాణాలొదిలిన ఘటనపై శుక్రవారం మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, మృతుడి గ్రామానికి చెందిన వారు తెలిపిన వివరాలివి. తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి బక్కయ్య, కేదారీశ్వరి దంపతుల కుమారుడు సాయికృష్ణ(19) ఇండియన్‌ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. దేహదారుఢ్య పరీక్ష ఉన్న రోజునే సోదరి వివాహ ముహూర్తం కుదిరింది. పరీక్ష కోసం వివాహ తేదీని డిసెంబరు 9వ తేదీకి మార్చారు.

సాయికృష్ణ తన స్నేహితుడితో కలిసి ఈ నెల 26న విశాఖ చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు విశాఖ పైపులైన్‌ జంక్షన్‌ వద్ద ఉన్న నేవీ మైదానంలో ఎంపిక పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత 100 మీటర్ల పరుగు పూర్తి చేసి, వెంటనే పులప్స్‌ తీస్తుండగా... కుప్పకూలిపోయాడు. తక్షణమే నేవీ సిబ్బంది ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక మృతి చెందినట్టు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌(కింగ్‌జార్జ్‌ ఆసుపత్రి)కి తరలించారు. ఈ కేసుని సీఐ కె.దుర్గాప్రసాద్‌ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని