బంగారు వ్యాపారికి ఝలక్‌

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బంగారు వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుపోయారు.

Updated : 03 Dec 2020 08:48 IST

ఒంగోలు నేరవిభాగం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బంగారు వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుపోయారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో బుధవారం రాత్రి జరిగిన ఈ వ్యవహారం బంగారు వర్తక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... జగ్గయ్యపేటకు చెందిన వ్యాపారి ఒకరు కిలో బంగారు బిస్కెట్లను ఆభరణాల తయారీ నిమిత్తం చెన్నై నుంచి తీసుకుని బయలుదేరారు. నెల్లూరు వరకు వేరొక వాహనంలో వచ్చారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ బయలుదేరారు.

ఒంగోలు బస్టాండుకి రాగానే కొందరు వ్యక్తులు బస్సులోకి ఎక్కి తాము ఐడీ పార్టీ పోలీసులమని, తనిఖీ చేయాలని ఆయనను కిందకు దింపి బంగారు బిస్కెట్లతో ఉడాయించారు. దీంతో అవాక్కయిన వ్యాపారి ఒంగోలులోని వర్తక సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సంఘం ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. ఏ స్టేషన్‌ నుంచి ఎవరూ ఈ తరహా కేసులో ఎవరి నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని వారు స్పష్టం చేయగా ఏం జరిగిందో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయం ఒంగోలు గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ద్వారా మా దృష్టికి వచ్చిందని డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. అసోసియేషన్‌ ఫిర్యాదు మేరకు పరిశోధన ప్రారంభించామని చెప్పారు. నేర స్థలాన్ని పోలీసులు పరిశీలించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని