Updated : 13 Jun 2021 09:56 IST

TS News: బియ్యం, వంటనూనె చోరుల పట్టివేత

రూ.10.20 లక్షల సరకు స్వాధీనం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ పురుషోత్తంరెడ్డి, మీర్‌పేట సీఐ, డీఐ

బాలాపూర్‌, న్యూస్‌టుడే: బియ్యం, వంట నూనెలు భారీ ఎత్తున చోరీ చేస్తున్న ఇద్దరు పాత నేరస్థులను మీర్‌పేట పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి వివరాల మేరకు... చాదర్‌ఘాట్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌రహీం(32), ఓల్డ్‌ మలక్‌పేట నివాసి తుమ్ము సాయినందకిషోర్‌ అలియాస్‌ చిన్న(36) బాల్యస్నేహితులు. ఓల్డ్‌ మలక్‌పేటలోని కారు మెకానిక్‌ షెడ్డులో అబ్దుల్‌రహీం సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. పికెట్‌లోని బియ్యం దుకాణంలో సాయినందకిషోర్‌ పనిచేస్తున్నాడు. నేర ప్రవృత్తి కలిగిన వీరు ఇటీవల మీర్‌పేట, సరూర్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, మాదన్నపేట్‌, సంతోష్‌నగర్‌, షాహినాయత్‌గంజ్‌ ఠాణాల పరిధిలో ఏడు చోరీలు చేశారు. తెల్లవారు జామున ప్రధాన రహదారులపై తిరుగుతూ బియ్యం, వేరుశనగ, వంట నూనె లోడ్‌తో నగరానికి వచ్చిన ట్రక్కులను గుర్తిస్తారు. సరకు దించుకోవాల్సిన యజమానులం తామేనని డ్రైవర్లను నమ్మించి తమ వాహనంలోకి ఎక్కించుకుని పరారవుతారు. దీంతోపాటు బియ్యం, వంటనూనె దుకాణాలను గుర్తించి తాళాలు పగులగొట్టి సరకును చోరీ చేసి వాహనాల ద్వారా తరలించేస్తున్నారు. వాటిని మలక్‌పేటగంజ్‌, ఖైరతాబాద్‌, చింతలబస్తీ ప్రాంతాల్లోని కిరాణా దుకాణదారులకు విక్రయిస్తున్నారు. నష్టం వచ్చినందున వ్యాపారం మానుకుంటున్నామని నమ్మించి తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. అబ్దుల్‌రహీం గతంలో పలు చీటింగ్‌ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లాడు. సాయినందకిషోర్‌ తెలుగు రాష్ట్రాల్లో 27 నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. 2019లో నగరంలో ఇతనిపై పీడీ చట్టం నమోదు చేసినట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలైన వీరు మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున వారు ఉంటున్న ఇంటిపై మీర్‌పేట పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.10.20 లక్షలు విలువ చేసే 1920 లీటర్ల వంటనూనె, 40 క్వింటాళ్ల బియ్యం, 1100 కిలోల జీలకర్ర, 2250 కిలోల వేరుశనగ పప్పు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేస్తున్నారు. రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ పర్యవేక్షణలో ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ నేతృత్వంలో తనతో పాటు మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి, డీ.ఐ. కె.సత్యనారాయణ బృందం నిందితులను అరెస్ట్‌ చేయడంలో కీలక భూమిక నిర్వహించినట్లు ఏసీపీ వివరించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts