HYD: డ్రగ్స్‌ కేసుకు ఇక మోక్షం!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మత్తుమందుల కేసుకు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించనుంది.

Updated : 01 Jul 2021 10:24 IST

 సిట్‌ అభియోగపత్రాలకు కోర్టు ఆమోదం

 త్వరలోనే న్యాయవిచారణ ఆరంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మత్తుమందుల కేసుకు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించనుంది. దీనిపై త్వరలోనే న్యాయ విచారణ మొదలుకానుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు పూర్తిచేసిన ఆబ్కారీశాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అభియోగపత్రాలు దాఖలు చేయగా వాటన్నింటినీ న్యాయస్థానం ఆమోదించింది. కరోనా వల్ల న్యాయవిచారణలో జాప్యం జరగడంతో వాయిదా పడింది.

నాలుగేళ్ల క్రితం అంటే 2017 జులై 2న ఆబ్కారీశాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్‌ మాస్కెరాన్స్, అబ్దుల్‌ వహాబ్, అబ్దుల్‌ ఖుద్దూస్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ.30లక్షల విలువైన మత్తుమందులను స్వాధీనం చేసుకున్నారు. అనేక మంది సినీ ప్రముఖులు, సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు, చివరకు పాఠశాల విద్యార్థులకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వారు విచారణలో చెప్పడంతో కంగుతిన్న అధికారులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని పిలిపించి విచారించారు. అంగీకరించిన వారి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరించారు. ఈ కేసుల్లో మొత్తం దాదాపు 30 మందిని అరెస్టు చేయగా 27 మందిని విచారించారు. నమోదు చేసిన 12 కేసులకు తొలుత 8 కేసులలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరగటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖుల ప్రమేయం ఉండటం వల్లనే ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు ఆలస్యం చేస్తున్నారని, కేసులు నమోదయి ఏళ్లవుతున్నా అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు మిగతా నాలుగు కేసులలోనూ దర్యాప్తు పూర్తిచేయడంతో పాటు సినీ ప్రముఖుల నుంచి సేకరించిన నమూనాలనూ విశ్లేషించి ఆ నివేదికలను కూడా పొందుపరచి అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం ఇటీవల ఆమోదం తెలపటంతో త్వరలోనే మత్తుమందుల కేసు న్యాయవిచారణ మొదలుకానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని