AP News: ఫోన్‌ చేసి కన్నవారిని రమ్మన్నాడు

మదనపల్లెకు వస్తున్నాను.. కురబలకోట స్టేషన్‌కు రావాలని తల్లిదండ్రులకు తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్‌ చేశాడు ఆ యువకుడు.. కంగారుపడిపోయిన వారు వెంటనే స్టేషన్‌కు చేరుకున్నారు.. కొడుకు కనబడక పోవడంతో ఆందోళన చెందారు.. ఫోన్‌ చేస్తే మోగుతుంది.

Updated : 14 Jul 2021 11:08 IST

అంతలోనే శవమై కనిపించాడు..

రైలు కింద పడి యువకుడి మృతి


మృతి చెందిన సుభాష్‌ (దాచిన చిత్రం)

కురబలకోట (మదనపల్లె అర్బన్‌): మదనపల్లెకు వస్తున్నాను.. కురబలకోట స్టేషన్‌కు రావాలని తల్లిదండ్రులకు తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్‌ చేశాడు ఆ యువకుడు.. కంగారుపడిపోయిన వారు వెంటనే స్టేషన్‌కు చేరుకున్నారు.. కొడుకు కనబడక పోవడంతో ఆందోళన చెందారు.. ఫోన్‌ చేస్తే మోగుతుంది.. కానీ తీయడం లేదు.. వారిలో టెన్షన్‌ మొదలైంది.. ఒకవైపు ఫోన్‌చేస్తూనే మరోవైపు రెండు గంటల పాటు వెతకగా చివరికి శవమై కనిపించడంతో తల్లడిల్లిపోయారు.. ఈ ఘటన దిగువబోయపల్లెకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... రైలు కింద పడి మదనపల్లె పట్టణం బయ్యారెడ్డి కాలనీకి చెందిన సుభాష్‌(27) దిగువబోయపల్లెకు సమీపంలో మృతిచెందాడు. తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి పంచాయతీ మొండిరేగానిపల్లెకు చెందిన ఆర్‌సీ వెంకటరమణ కుటుంబం మదనపల్లె పట్టణం అమ్మచెరువు మిట్ట సమీపంలోని బయ్యారెడ్డికాలనీలో నివసిస్తోంది. ఆయన కుమారుడైన రేపన సుభాష్‌ డెహ్రడూన్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. సుభాష్‌ మంగళవారం తెల్లవారుజామున రైలులో కురబలకోటకు చేరుకున్నాడు. 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి కురబలకోట రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్నానని, వెంటనే ఇక్కడికి రావాలని కోరాడు. వారు హుటాహుటిన చేరుకున్నా సుభాష్‌ కనబడలేదు. ఆయనకు ఫోన్‌ చేస్తూ సుమారు రెండు గంటల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలోనే దిగువబోయపల్లెకు సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడు పడి ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. ఈ సమయంలోనే వారి నుంచి ఫోన్‌ రావడంతో తీసుకొని మాట్లాడారు. ఇక్కడ ఓ మృతదేహం పడిఉందని వారికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని కుమారుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కుటుంబీకులు కదిరి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని