
bihar: మహిళను చితకబాదిన అర్చకుడు..
బిహార్: దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. మూసి ఉన్న ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందన్న కారణంతో ఆమెను తీవ్రంగా కొట్టాడో అర్చకుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బిహార్‌లోని దర్భంగాలో ఉన్న ‘శ్యామా దేవాలయం’లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర బిహార్‌తో పాటు.. నేపాల్ నుంచి భక్తులు అధికంగా వచ్చే ఈ ఆలయంలో పనిచేస్తున్న ఓ పూజారి భక్తురాలిని జుట్టు పట్టుకుని మరీ తీవ్రంగా కొట్టాడు. ఘటన అనంతరం ఆలయ కమిటీ పూజారిని తొలగించింది. సదరు మహిళకు మతిస్థిమితం సరిగా లేదని గుడి తలుపు పగలగొట్టేందుకు ప్రయత్నించిందని.. అందుకే కొట్టాల్సి వచ్చిందని పూజారి వివరణ ఇచ్చాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. మహిళా జుట్టు పట్టుకుని పూజారి కొడుతుండటం కనిపించింది. ఈ చర్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. మహిళ ప్రవర్తనపై ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.