Saidabad: పారిపోయేందుకు ఆటో చోరీచేద్దామనుకున్నా..

నిందితుడు రాజు ఎల్బీనగర్‌లో ఓ ఆటోను దొంగిలించి అందులోనే పారిపోవాలని భావించాడు.

Published : 17 Sep 2021 08:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిందితుడు రాజు ఎల్బీనగర్‌లో ఓ ఆటోను దొంగిలించి అందులోనే పారిపోవాలని భావించాడు. టీ తాగేందుకు వెళ్లిన ఆటో యజమాని రావడంతో పథకం పారలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈనెల 11న రాజు పోలికలతో ఉన్న ఓ వ్యక్తి ఆటోలో వెనుక భాగంలో కూర్చున్నట్లు గుర్తించారు. యజమాని లేకపోవడంతో ముందుకొచ్చి ఆటోను స్టార్ట్‌ చేసేందుకు యత్నించినట్లు కనిపించింది. అది చూసిన యజమాని అక్కడికొచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీసి రాజు దగ్గరున్న సంచిని పరిశీలించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆటో యజమానిపై దాడి చేసేందుకు యత్నించగా పక్కనున్న ఆటోడ్రైవర్లు, స్థానికులు అడ్డుకున్నారు. ఇద్దర్నీ సముదాయించి పంపించేశారు. ఆ తర్వాత నిందితుడు ప్రధాన చౌరస్తాలోని ఓ హోటల్‌వైపు వెళ్లి అక్కడ బస్సు ఎక్కాడు. బండి నంబర్‌ ఆధారంగా ఆ ఆటో డ్రైవర్‌ను గుర్తించి.. మరిన్ని వివరాలు సేకరించారు. రాజు గురించి ఎవరికీ అవగాహన లేకపోవడంతో తప్పించుకున్నాడని, లేదంటే అదే రోజు చిక్కేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో నిందితుడిపై చైతన్యపురి ఠాణాలో ఆటో చోరీ కేసు నమోదైందన్నారు.

ఆచూకీ తెలుస్తోందనగా ఆత్మహత్య

హత్యాచార ఘటన జరిగిన రెండో రోజు నుంచే నిందితుడు రాజు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించాం. వేల సంఖ్యలో సీసీ కెమెరాలను పరిశీలించి, శాస్త్రీయంగా పరిశోధించి ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ నిందితుడి ఆచూకీ దాదాపు తెలుసుకొనేవరకూ వెళ్లాం. ఈ లోపే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది.- అంజనీకుమార్‌, హైదరాబాద్‌ సీపీ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు