Allahabad high court: బాధితుల హక్కుల్నీ పరిగణించాకే బెయిల్‌

తీవ్రమైన కేసుల్లో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసే ముందు బాధితులు, వారి కుటుంబీకుల హక్కుల్నీ పరిగణనలో తీసుకోవాలని అలహాబాద్‌ ...

Published : 22 Sep 2021 10:10 IST

తీవ్రమైన కేసుల్లో అలా చేయడం మేలు
అలహాబాద్‌ హైకోర్టు ప్రమాణ పత్రం

దిల్లీ: తీవ్రమైన కేసుల్లో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసే ముందు బాధితులు, వారి కుటుంబీకుల హక్కుల్నీ పరిగణనలో తీసుకోవాలని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయపడింది. బాధితులతో సంప్రదించి ‘బాధితుల ప్రభావ అంచనా’ నివేదికను రప్పించాల్సి ఉందని సూచించింది. భౌతికంగా, మానసికంగా, సామాజికంగా సంబంధిత నేరం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, నిందితుడికి బెయిల్‌ ఇస్తే దాని ప్రభావం బాధితులపై ఎంతమేరకు ఉంటుంది అనే వివరాలన్నీ ఈ నివేదికలో స్పష్టంగా ఉండాలంది. శిక్ష పడిన ముద్దాయిల బెయిల్‌ దరఖాస్తుల విషయంలో విధి విధానాల రూపకల్పనకు సహాయపడాల్సిందిగా సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు అలహాబాద్‌ హైకోర్టు ఒక ప్రమాణపత్రాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. సగానికి పైగా శిక్షా కాలం పూర్తయిన ముద్దాయిల క్రిమినల్‌ అప్పీళ్ల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఘరానా నేరాలకు పాల్పడిన వారి విషయంలో నిబంధనలు విడిగా ఉండడం మేలని అభిప్రాయపడింది. అవసరమైతే ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలంది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ అఫిడవిట్‌ను పరిశీలించే అవకాశాలున్నాయి.
నిబంధనల మేరకే పుట్టిన తేదీ మార్పు
పుట్టిన తేదీలో మార్పు చేయాలంటూ వచ్చే దరఖాస్తుల్ని నిబంధనల మేరకే పరిశీలించాలని, బలమైన ఆధారాలున్నప్పటికీ వాటిని హక్కుగా కోరడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆలస్యంగా, ముఖ్యంగా పదవీ విరమణకు కొద్దికాలం ముందు వచ్చే దరఖాస్తుల్ని తిరస్కరించవచ్చని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నల ధర్మాసనం మంగళవారం తేల్చిచెప్పింది. ఒక ఉద్యోగి పుట్టిన తేదీ మార్పు విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీలుపై ధర్మాసనం విచారణ జరిపింది.
దావా కారణం చెప్పకపోతే కేసుల్ని తిరస్కరించవచ్చు
దావా వేయడానికి కారణాన్ని వెల్లడించకపోతే అలాంటి సివిల్‌ కేసులను తిరస్కరించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది తీవ్రమైన చర్యే అయినప్పటికీ బూటకపు వ్యాజ్యాలను అడ్డుకునేందుకు అలా చేయడం అవసరమని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుల విలువైన సమయాన్ని మరింత వృథా కానివ్వకుండా చూడాలంటే ఇది తప్పదని ఒక కేసు విచారణ సందర్భంగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని