DRDO Secret Leak: డీఆర్‌డీఓ రహస్యాల లీకేజీ వెనుక మహిళ

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లోని డీఆర్‌డీఓ రహస్యాల లీకు ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి...

Updated : 22 Sep 2021 14:04 IST

క్రైమ్‌బ్రాంచి ఏడీజీ సంజీబ్‌ పండా వెల్లడి

కటక్: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లోని డీఆర్‌డీఓ రహస్యాల లీకు ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టు చేసిన అయిదుగురు వ్యక్తులను ఒడిశా క్రైమ్‌బ్రాంచి అధికారులు రిమాండ్‌కు తీసుకొని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. మంగళవారం ఏడీజీ సంజీబ్‌ పండా మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితుల్లో ఒకరి బ్యాంకు ఖాతాకు దుబాయ్‌ నుంచి రెండు విడతల్లో రూ.38,000 వచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. నిందితులు ఓ మహిళతో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేశారు. ఆమె యూకేకు చెందిన సెల్‌ఫోన్‌ నంబరు ద్వారా ఫేస్‌బుక్, వాట్సాప్‌లో సంభాషించింది. ఆమె ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల (హ్యాండ్‌లర్ల)తో పరిచయం ఏర్పడింది. హ్యాండ్‌లర్లకు రహస్యాలు పంపినందుకు ఈ అయిదుగురు డీల్‌ కుదుర్చుకున్నారు. సదరు మహిళ వేర్వేరు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల వారితో ఛాటింగ్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నిందితుల సోల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, వివరాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాం. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో భారత వైమానిక దళానికి చెందిన అధికారులు కటక్‌  చేరుకొని రెండు రోజులపాటు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించారు’ అని తెలిపారు.

బంగ్లాదేశ్‌ వలసదారులపై అనుమానం..
క్రైమ్‌ బ్రాంచి అధికారి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అయిదుగురు నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉండేవారని, అతడి ఆదేశాల మేరకు రహస్యాలు సేకరించి పంపేవారని, వారు నగదు జమ చేసేవారని తెలిపారు. నగదు లావాదేవీలు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోని స్లీపర్‌సెల్స్‌ ద్వారా జరిగేవని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి బాలేశ్వర్‌లో ఉంటున్న వలసదారులు వారికి సమాచారం చేరవేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాలకు జరిగిన లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించారని, అవసరమైతే దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల సహాయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని