Crime News: తండ్రి కళ్లెదుటే కొడుకు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే కొడుకు మృతిచెందిన దుర్ఘటన ఇది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మండల పరిధిలోని కరుణగిరి.....

Updated : 09 Oct 2021 07:57 IST


తీవ్ర గాయాలతో పడిఉన్న దేవయ్య, పవిత్ర, ఠాగూర్‌ మృతదేహం

 

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే కొడుకు మృతిచెందిన దుర్ఘటన ఇది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మండల పరిధిలోని కరుణగిరి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సత్యనారాయణపురం సమీపంలోని సాయినగర్‌కాలనీకి చెందిన ఎనగందుల దేవయ్యకు కుమారుడు ఠాగూర్‌(17), కూతురు పవిత్ర. దేవయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఠాగూర్‌ ఇంటర్‌ ద్వితీయ, పవిత్ర ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. వీరిని కళాశాలలకు తీసుకెళ్లేందుకు తన ద్విచక్రవాహనంపై ఖమ్మం బయలుదేరారు. మార్గమధ్యలో కరుణగిరి వంతెన వద్దకు రాగానే వెనక నుంచి అతివేగంగా లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఠాగూర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. పవిత్రకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఠాగూర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. దేవయ్య భార్య విజయకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు.

మిన్నంటిన ఆర్తనాదాలు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఠాగూర్‌ను చూసి... తీవ్ర గాయాలతో ఉన్న తండ్రి దేవయ్య, మృతుని సోదరి పవిత్ర బోరున విలపించారు. స్థానికులూ కన్నీటిపర్యంతమయ్యారు. డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు, క్షతగాత్రులు ఆరోపించారు.

ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన ఠాగూర్‌

ఠాగూర్‌ చనిపోయి కూడా ఇద్దరికి కంటిచూపునిచ్చారు. మేనమామ ఆర్‌.రాము సహకారంతో ఇతని నేత్రాలను దానం చేశారు. వీటిని ఖమ్మం నేత్రనిధి టెక్నీషియన్లు బి.జానీ, ఎం.నాగేశ్వరరావు సేకరించారు. నేత్రనిధి కార్యదర్శి ఆర్‌.ఎ.పద్మనాభం, సభ్యుడు హనుమంతరావు, నేత్రదాన కౌన్సెలర్‌ హరిప్రసాద్‌, ఎన్‌.శ్రీనివాసాచారి, విజయ్‌చందర్‌ ప్రోత్సహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని