Crime News: నీలిచిత్రాలు చూడలేదని..  ఆరేళ్ల బాలికను రాళ్లతో కొట్టి చంపి..

‘కుటుంబం, సామాజిక పరిస్థితుల మార్గదర్శనం బాగుంటే.. నేడు  నలుగురు పిల్లల 

Published : 22 Oct 2021 12:01 IST

ఈనాడు, గువాహటి: ‘కుటుంబం, సామాజిక పరిస్థితుల మార్గదర్శనం బాగుంటే.. నేడు  నలుగురు పిల్లల జీవితాలను కాపాడి ఉండేవి. ఒకరు ప్రాణం కోల్పోతే.. మిగతా ముగ్గురూ జీవితమే కోల్పోయారు. ఇలా మన చుట్టూ మరెవరికైనా కూడా జరగవచ్చు. సమాజంలో నైతిక విలువలు పడిపోతే బాధ్యత మనదే అవుతుంది’ అని అస్సాంలోని నగావ్‌ జిల్లా ఎస్పీ ఆనంద్‌ మిశ్రా వ్యక్తం చేసిన ఆవేదన ఎన్నో కుటుంబాలకు ఓ హెచ్చరిక. ఈ జిల్లాలోని కలియబర్‌ పట్టణ పరిధి మిస్సా గ్రామంలో 8 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలలు ఆరేళ్ల బాలిక ఉసురు తీసిన సంఘటన వివరాలు వెల్లడిస్తూ ఎస్పీ ఈ వ్యాఖ్యలు చేశారు. అశ్లీల వీడియోలు చూసేందుకు అలవాటుపడ్డ ముగ్గురు చిన్నారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తమతో కలిసి ఆ వీడియోలు చూసేందుకు నిరాకరించిందని ఆరేళ్ల బాలికను అమానుషంగా హత్య చేశారు. నిందితుల్లో ఇద్దరి వయసు 11 ఏళ్లు, మరొకరి వయసు 8 ఏళ్లే. 24 గంటల్లో ఈ కేసును ఛేదించిన పోలీసులు పూర్తి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు బుధవారం రాత్రి వెల్లడించారు. నేరాన్ని దాచేందుకు యత్నించిన కారణంగా.. నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశారు. మిస్సాలోని ఒక క్వారీ వద్ద మరుగుదొడ్డిలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం క్వారీ వద్దకు బాలికను రమ్మని పిలిచిన ముగ్గురు బాలలు తమతోపాటు మొబైల్‌ ఫోనులో నీలిచిత్రాలు చూడాలని ఒత్తిడి తేగా ఆమె నిరాకరించింది. దీంతో వారు ఆగ్రహానికి గురై అక్కడున్న రాళ్లతో ఆమెను హతమార్చినట్లు తెలిసింది. ముగ్గురు బాలల్లో ఒకరు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు అతని తండ్రి స్మార్ట్‌ఫోను ఇవ్వగా.. మిగతా ఇద్దరితో కలిసి అందులో నీలిచిత్రాలు చూడటానికి అతను అలవాటు పడినట్లు తెలిసింది. నిందితుల చేతుల్లో ఉన్న ‘తండ్రి’ మొబైల్‌ ఫోను స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. అందులో అన్నీ అశ్లీల వీడియోలే ఉన్నాయని ఎస్పీ మిశ్రా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని