
వీసాలు, అమెరికాలో ఉద్యోగాలంటూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల నుంచి రూ.4 కోట్లు వసూలు
భాస్కర్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: అమెరికా వెళ్లేందుకు వీసాలతోపాటు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను మోసం చేస్తున్న ఘరానా నిందితుడు తిప్పులరెడ్డి భాస్కర్‌రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అమీర్‌పేటలో డొమైన్ నెట్వర్క్ జోన్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న భాస్కర్‌రెడ్డి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.4 కోట్లు వరకు వసూలు చేశాడు. రెండు నెలల క్రితం కన్సల్టెన్సీకి తాళమేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన ఎస్సై మహేశ్, చిత్తూరు జిల్లాలో ఉన్నాడని తెలుసుకొనిపుత్తూరులో పట్టుకొన్నారు. స్థానిక కోర్టులో హాజరుపరచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి సోమవారం జైలుకు తరలించారు.
చిత్తూరు జిల్లా ముడియంవారిపల్లికి చెందిన తిప్పులరెడ్డి భాస్కర్‌రెడ్డి పదిహేడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి అమీర్‌పేటలో డొమైన్ నెట్వర్క్ జోన్ పేరుతో శిక్షణ సంస్థను ప్రారంభించాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు జావా, సాప్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవాడు. వీసాలూ ఇప్పిస్తే కమీషన్ వస్తుందని తెలుసుకోవడంతో ఆరేళ్ల క్రితం డొమైన్ కన్సల్టెన్సీ పేరుతో వీసా ఏజెంట్‌గా మారాడు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగాలిప్పిస్తున్న అమెరికా సంస్థల గురించి తెలుసుకున్నాడు. విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు, ఎల్-1, ఇతర వీసాలతోపాటు గ్రీన్‌కార్డు పొందేందుకు సాయం చేస్తానంటూ చెప్పేవాడు. రూ.లక్షల్లో కమీషన్ తీసుకునేవాడు. హైదరాబాద్‌లో ఉంటున్న టి.కృష్ణప్రసాద్ నుంచి రూ.2.70 కోట్లు వసూలు చేసి మోసం చేశాడు. కృష్ణప్రసాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై మహేశ్ వివరాలు సేకరించారు. మరొకరి నుంచి రూ.1.30 కోట్లు తీసుకున్నాడని తెలుసుకున్నారు. వీరిద్దరితోపాటు మరికొందరు బాధితులున్నారని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.