TS News: లంచాలన్నీ మంచాల కిందే..!

సంగారెడ్డి జిల్లా భూకొలతల శాఖ సహాయ సంచాలకుడు మధుసూదన్‌రావు కొద్దిరోజుల క్రితం రూ.20 వేలు లంచం తీసుకుంటూ 

Updated : 07 Nov 2021 09:55 IST

ఇళ్లలోనే కట్టలు కట్టలుగా ఆమ్యామ్యాల పైకం
 అక్రమార్కుల నయా పంథా

ఈనాడు, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా భూకొలతల శాఖ సహాయ సంచాలకుడు మధుసూదన్‌రావు కొద్దిరోజుల క్రితం రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ బృందానికి చిక్కారు. అనంతరం హైదరాబాద్‌ ఉప్పల్‌లోని అతడి ఇంట్లో సోదాలు చేయగా.. ఏకంగా రూ.1.03 కోట్ల నగదు, 314.77 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో రూ.95.55 లక్షల ఆస్తి దస్తావేజులు లభించాయి. పెద్ద సంఖ్యలో కవర్లలో రోజుల తరబడి పోగుపడి ఉన్నట్లుగా కనిపించిన సొమ్మంతా లంచాల ద్వారా వచ్చినదేనని తేలడంతో అధికారులు విస్తుపోయారు. 

..ఆమ్యామ్యా మేత మేస్తున్న అక్రమార్కులు రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. అప్పటికప్పుడు అక్రమాస్తులు పోగేయడం కంటే.. చేతివాటం ప్రదర్శించి దండుకున్న సొమ్మును ప్రస్తుతానికి దాచేయడమే మంచిదనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని తాజా ఉదంతాలు స్పష్టంచేస్తున్నాయి. గతంలో అయితే లంచాల సొమ్ముతో ఎక్కువగా అక్రమాస్తులు పోగేసుకునేవారు. బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసేవారు. అయితే, ఈ వ్యవహారాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని.. ఇళ్లలోనే అక్రమార్జనను పోగేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఈ కేసులు పర్యవేక్షిస్తున్న సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఒకసారి అనిశాకి చిక్కితే చాలు బినామీలు ఎదురుతిరుగుతుండటంతో లంచావతారులు రూటు మార్చినట్లు అనిపిస్తోందన్నారు. మొత్తంమీద అక్రమార్కులు దోచుకున్న సొమ్మునంతా తమ ఇళ్లలో లేదంటే రక్తసంబంధీకుల నివాసాల్లో దాచేస్తున్నట్లు పలు ఉదంతాలు స్పష్టంచేస్తున్నాయి. 

తహశీల్దార్‌ ఇంట్లో అవినీతి కట్టలు

2019 జులైలో రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్‌ లావణ్య అనిశాకి చిక్కారు. ఆమె కోసం వీఆర్వో అనంతయ్య ఓ రైతు నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకొన్నారు. అనంతరం హయత్‌నగర్‌లోని లావణ్య ఇంట్లో సోదాలు చేయగా ఏకంగా రూ.93.5 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం లభ్యమైంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని