కలలు తీరకుండానే అనంతలోకాలకు..

కష్టసుఖాల్లో తోడుగా జీవించిన దంపతులు మృత్యువులోనూ ఒక్కటిగానే అనంతలోకాలకు పయనమయ్యారు. రెక్కల కష్టంపై జీవిస్తూ కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. ఇక వారికి పెళ్లిళ్లు చేసి బాధ్యతను తీర్చుకుందామనుకున్న

Updated : 04 Dec 2021 06:49 IST

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

కృష్ణమ్మ

సత్తపల్లి, న్యూస్‌టుడే: కష్టసుఖాల్లో తోడుగా జీవించిన దంపతులు మృత్యువులోనూ ఒక్కటిగానే అనంతలోకాలకు పయనమయ్యారు. రెక్కల కష్టంపై జీవిస్తూ కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. ఇక వారికి పెళ్లిళ్లు చేసి బాధ్యతను తీర్చుకుందామనుకున్న వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. సత్తుపల్లి శివారులో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సత్తుపల్లి మండలం గంగారం ప్రకాశ్‌నగర్‌కు చెందిన కొలికపోగు శ్రీనివాసరావు(45), కృష్ణమ్మ(40) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణమ్మ తల్లి ఆదిలక్ష్మి వేంసూరు మండలం బీరాపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆమెను చూసేందుకు వెళ్లి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగివస్తుండగా సత్తుపల్లి శివారు తమ్మిలేరు వంతెన వద్ద జాతీయ రహదారిపై వీరి ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనతో దంపతులు రోడ్డుపై పడిపోగా లారీ వారిపై నుంచి వెళ్లడంతో దేహాలు ఛిద్రమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఎస్సై రామునాయక్‌, సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను సత్తుపల్లి సీహెచ్‌సీ శవపరీక్షా కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని తాళ్లమడ వద్ద పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల మరణ వార్త విన్న కూతుళ్లు తల్లడిల్లిపోయారు. పెద్దకుమార్తె సృహ కోల్పోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు, కృష్ణమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మంచివారిగా పేరున్న వీరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని