
AP News: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
చంద్రగిరి : చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తి గ్రామానికి చెందిన జిషిత (6 నెలలు), మీనా (30), సురేశ్ కుమార్ (36), పైడి హైమావతి (51), గోవిందరావు(61), శ్రీరామమూర్తి, ఓ మహిళగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. చిన్నారి మొక్కు తీర్చేందుకు తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితుల బంధువులు వెల్లడించారు.