
AP News: ఎంపీడీవోను దూషించిన వైకాపా నేత అరెస్టు
అయినవిల్లి, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్ విజయను దుర్భాషలాడిన వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి వాసంశెట్టి తాతాజీని అదుపులోకి తీసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మంగళవారం తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాతాజీ, అయినవిల్లి జడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, కె.జగన్నాథపురం సర్పంచి భర్త మేడిశెట్టి శ్రీనివాస్, శంకరాయగూడెం మాజీ సర్పంచి కుడిపూడి రామకృష్ణ ‘మా మాట వినకపోతే చీరెస్తా’ అంటూ బెదిరించారని ఎంపీడీవో విజయ సోమవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారిని అసభ్య పదజాలంతో దూషించారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంపీడీవోను బెదిరించినందుకు నిరసనగా జిల్లాలో పలుచోట్ల ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది నిరసన చేపట్టారు.