ఆలుమగల మధ్య గొడవ: కళ్లలో కారం కొట్టి.. కత్తులతో నరికారు

భార్యాభర్తల గొడవ రెండు కుటుంబాల మధ్య కత్తులు దూసుకునే వరకు వెళ్లింది. ఈ దాడి ఓ మహిళ ప్రాణాన్ని బలిగొనగా.. ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యేలా చేసింది. ఈ ఘటన

Updated : 22 Dec 2021 08:40 IST

భర్త ఇంటిపై భార్య కుటుంబీకుల దాడి

మహిళ మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

నిడమనూరు, న్యూస్‌టుడే: భార్యాభర్తల గొడవ రెండు కుటుంబాల మధ్య కత్తులు దూసుకునే వరకు వెళ్లింది. ఈ దాడి ఓ మహిళ ప్రాణాన్ని బలిగొనగా.. ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యేలా చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్‌లో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్‌కు చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ దంపతుల కుమారుడు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జిల్లపల్లి సూర్యనారాయణ, యశోద దంపతుల కుమార్తె శ్యామలతో అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శివనారాయణ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవారు. కరోనా కారణంగా స్వగ్రామానికి తిరిగొచ్చి.. వారికున్న పదెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. వివాహమైన ఏడాది నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పట్లో గ్రామపెద్దలు వీరిద్దరికీ సర్దిచెప్పారు. ఈక్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం శ్యామల తల్లిగారింటికి ఫోన్‌ చేసి చెప్పింది. తరచూ గొడవల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్యామల తండ్రి సూర్యనారాయణ, తల్లి యశోద, అన్న శివ.. ఉదయం 8.30 గంటల సమయంలో శివనారాయణ ఇంటికి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న కారాన్ని ఇంట్లో ఉన్న శివనారాయణ, అతని తండ్రి భిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, అమ్మమ్మ నారమ్మ కళ్లల్లో కొట్టారు. కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన అచ్చమ్మ(60).. అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ ముగ్గురినీ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, క్లూస్‌ టీం సభ్యులు సంఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. మిర్యాలగూడ ప్రథమశ్రేణి కోర్టు న్యాయమూర్తి మాధవి క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. శివనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జునసాగర్‌ సీఐ గౌరినాయుడు తెలిపారు. నిందితులు సూర్యనారాయణ, యశోద, శివ నిడమనూరు ఠాణాలోలొంగిపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని