Crime News: కన్నవారే కామాంధులై...

వినడానికి, చదవడానికి జీర్ణించుకోలేని విధంగా ఉన్నా, ఇలాంటివి రెండు ఘటనలు జరగడం అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది...

Updated : 08 Jan 2022 07:14 IST

16 నెలల పసికందుపై తండ్రి హత్యాచారం

సహకరించిన భార్య

వినడానికి, చదవడానికి జీర్ణించుకోలేని విధంగా ఉన్నా, ఇలాంటివి రెండు ఘటనలు జరగడం అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఓ ఘటనలో పసికందుపై కన్నతండ్రి హత్యాచారం చేయగా, రెండో ఘటనలో కుమారుడిపై నాన్న అఘాయిత్యం చేస్తున్నాడని తల్లి ఫిర్యాదు చేసింది. 

ఈనాడు, పుణె: ముక్కుపచ్చలారని 16 నెలల పసికందుపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కనికరం లేకుండా గొంతు నులిమి చంపాడు. ఈ ఘాతుకానికి పసిగుడ్డు తల్లీ సహకరించడం అమ్మతనానికి మాయని మచ్చ. చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తరలించేందుకు రైలెక్కగా ప్రయాణికుల అనుమానంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితులు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వెళ్తుండగా మహారాష్ట్రలోని షోలాపూర్‌ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్‌కోట్‌కు చెందిన దంపతులు సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కన్నకూతురిపై తండ్రి(26) ఈ నెల 3న ఇంట్లో లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించింది. మూడో కంటికి తెలియకుండా కప్పిపెట్టేందుకు వారు మృతదేహాన్ని రాజ్‌కోట్‌కు తీసుళ్లాలని భావించారు. సికింద్రాబాద్‌లో రాజ్‌కోట్‌ రైలెక్కారు. ఎంతసేపైనా పాపలో చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు టీటీఈకి విషయాన్ని తెలిపారు. ఆయన రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో షోలాపూర్‌లో వారిని దింపేశారు. పోక్సో సహా పలు సెక్షన్ల కింద దంపతులపై కేసు నమోదు చేశారు.

కొడుకుపై నాన్న లైంగిక దాడి చేస్తున్నట్లు ఫిర్యాదు

ఉప్పల్‌, న్యూస్‌టుడే: కన్న కొడుకునే తండ్రి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ తల్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరలయింది. ఉప్పల్‌కు చెందిన జంటకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల కుమారుడున్నాడు. భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. బాబుని కొన్ని రోజులు తండ్రి వద్ద ఉంచాలని కోర్టు ఆదేశించింది. తండ్రి వద్దకు పంపిన సమయంలో లైంగికంగా వేధించాడని చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని