AP News: ఆలుమగలు.. అప్పు కోసం అన్నాచెల్లెళ్లుగా మారి..

ఆధార్‌ కార్డుల్లో అడ్రస్సులు మార్చి బ్యాంకు అధికారులను మోసం చేసి రూ.9లక్షల రుణం తీసుకున్న కేసును గ్రామీణ పోలీసులు చేధించారు. గ్రామీణ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్సై భక్తవత్సలరెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం

Updated : 12 Jan 2022 10:31 IST

నరసరావుపేట లీగల్‌, న్యూస్‌టుడే: ఆధార్‌ కార్డుల్లో అడ్రస్సులు మార్చి బ్యాంకు అధికారులను మోసం చేసి రూ.9లక్షల రుణం తీసుకున్న కేసును గ్రామీణ పోలీసులు చేధించారు. గ్రామీణ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్సై భక్తవత్సలరెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన దొండపాటి పవన్‌, ప్రభావతి దంపతులు. సంతమాగులూరు మండలం కొప్పరంలో భూముల విషయం తెలిసి పవన్‌ తన పేరును పల్లా వెంకటేశ్వర్లుగా మార్చుకున్నాడు. అనంతరం ప్రభావతితో కలిసి నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వచ్చి అన్నా చెల్లెళ్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో రెండు సర్వే నంబర్లలో 4.73 ఎకరాలు, 4.62 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా సంతమాగులూరు తహశీల్దార్‌ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు.

ఈ ప్రక్రియలో కర్రావుల మునయ్య, గుర్రం చిన్న మల్లికార్జునరావు వీరికి సాయం చేశారు. తర్వాత నరసరావుపేట మండలం ఉప్పలపాడులోని చైతన్య గోదావరి బ్యాంకులో 2020లో ఒక్కొక్కరు రూ.4.50లక్షల చొప్పున మొత్తం రూ.9లక్షల రుణం పొందారు. వీరు కిస్తీలు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి మోసానికి గురైనట్లు తెలుసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో బ్యాంకు మేనేజర్‌ పల్లెపోగు అంకిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్‌, ప్రభావతిలకు మునయ్య, మల్లికార్జునరావుతో పాటు సరిమళ్ల జ్యోతిబాబు, సంతమాగులూరు తహశీల్దార్‌ కార్యాలయ కంప్యూటర్‌ ఆపరేటర్‌ కిషోర్‌బాబు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో నిందితులైన పవన్‌, ప్రభావతి, మునయ్యలను అరెస్టు చేసి వారి నుంచి రూ.9 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు బాలనాగిరెడ్డి, శ్రీహరి, సిబ్బంది ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని