
ద్విచక్రవాహనం కోసం చంపేశారు!
మిస్టరీని ఛేదించిన జైనథ్, సీసీఎస్ పోలీసులు
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, పక్కన డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, చిత్రంలో నిందితులు
ఆదిలాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే : జైనథ్ మండలం తరుణం గ్రామ సమీపంలో జరిగిన వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాన్ని దొంగలించడానికి ఏకంగా వ్యక్తినే హత్య చేసినట్లు శనివారం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 4న జైనథ్ మండలం తరుణం గ్రామం సమీపంలో జైనథ్, చంద్రపూర్ రహదారి పక్కన జైనథ్ పోలీసులకు ఓ గుర్తు తెలియని మృతదేహం లభించింది. శవం కనపడకుండా ముళ్లకంప ఉంచడం.. గొంతుపై కత్తితో గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం పట్టణంలోని పుత్లిబౌలికి చెందిన ఇందూర్ గజానంద్(36)గా గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 15 రోజుల్లో మిస్టరీని ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డీఎస్పీ వేంకటేశ్వరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేసు విచారణను వేగంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు, స్థానికంగా లభించిన సాక్ష్యాధారాలతో బంగారుగూడకు చెందిన 22 ఏళ్ల షేక్ అస్లాం, 20 ఏళ్ల ఎటుకోక విజయ్ హత్య చేసినట్లు గుర్తించారన్నారు.
ఈ నెల 1న గజానంద్ ఎన్టీఆర్ చౌక్‌లో తన ద్విచక్ర వాహనాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు నిందితులు తెలుసుకున్నారు. తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. ఆ రోజంతా చీకటి పడే వరకు పట్టణంలోని పలు కూడళ్లలో తిప్పారు. ఆ తరువాత జైనథ్ రహదారిలో గజానంద్‌ను హత్య చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనం దొంగలించడానికే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ వేంకటేశ్వరావు, జైనథ్ సీఐ కొంక మల్లేష్, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. వారికి పురస్కారం అందించనున్నట్లు పేర్కొన్నారు.