డబ్బుల కోసమే కాల్పులు

సర్పంచిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే నేరానికి పాల్పడ్డారని ఎస్పీ అమిత్‌బర్దార్‌ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరులకు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం

Updated : 23 Jan 2022 06:15 IST

సర్పంచిపై హత్యాయత్నం కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ

వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దార్‌

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: సర్పంచిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే నేరానికి పాల్పడ్డారని ఎస్పీ అమిత్‌బర్దార్‌ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరులకు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచి గొలివి వెంకటరమణమూర్తి కాంట్రాక్టర్‌గా చేస్తున్నారు. శ్రీకాకుళం నగరం మధురానగర్‌ కాలనీలోని సొంత కార్యాలయంలోనే ఈ నెల 18న ఆయనపై హత్యాయత్నం జరిగింది. కేసులో ప్రధాన సూత్రధారి, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షాలినీ సూచన ప్రకారం ఆమె తమ్ముడు గిరి, అతని స్నేహితుడు మధ్యప్రదేశ్‌ వాసి మోహిత్‌ పిస్టల్‌తో కాల్పులు జరిపారు. షాలినీ కొంతకాలం కిందట శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకొని ఇక్కడే ఉంటోంది. మూర్తితో అయిదేళ్లుగా ఆమెకు పరిచయం ఉంది. దాంతో ఆమె రూ.10 లక్షలివ్వాలని డిమాండ్‌ చేసింది. ఆయన నిరాకరించడంతో రూ.2 లక్షలైనా ఇవ్వాలంది. అంగీకరించకపోవడంతో హత్యకు పథకం వేసినట్టు ఎస్పీ వివరించారు. ఘటనలో మూర్తి చిన్న గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. 

  స్వాధీనం చేసుకున్న  పిస్టల్‌, బుల్లెట్లు

3 రోజులు.. 4 బృందాలు..

ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. దేశీయంగా తయారైన పిస్టల్‌తో పాటు, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనికి లైసెన్స్‌ కూడా లేదన్నారు. క్రైం అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో కేసును మూడు రోజుల్లోనే ఛేదించామన్నారు. నాలుగు బృందాలుగా ఒకటో పట్టణ సీఐ అంబేడ్కర్‌ షాలినీని, రెండోపట్టణ సీఐ ఈశ్వరప్రసాద్‌ తన బృందంతో కలిసి గిరి, మోహిత్‌లను పట్టుకున్నారని వివరించారు. వారిని ఎస్పీఅభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని