
హతమార్చి.. వాగులో పడేశారు..
గుర్తు తెలియని వ్యక్తి హత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ, ఎస్సైలు (అంతరచిత్రంలో గుర్తు తెలియని వ్యక్తి)
కనకాపూర్(లక్ష్మణచాంద), న్యూస్‌టుడే: నిర్మల్- మంచిర్యాల ప్రధాన మార్గంలో లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ వద్ద వాగులో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వ్యక్తిని హతమార్చి వాగులో పడేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సోన్ సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై రాహుల్‌గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కనకాపూర్ వాగులో ఉదయం అటుగా వెళ్లిన వారికి నీటిలో తేలియాడుతున్న వ్యక్తి కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయటంతో వారు వచ్చి పరిశీలించారు. రహదారిపైన, వంతెన పైన రక్తపు మరకలు కనిపించాయి. వాహనంలో వచ్చి మృతదేహాన్ని పడేసినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. సదరు వ్యక్తికి 45 సంవత్సరాల్లోపు వయస్సు ఉంటుందని, ఒంటిమీద బనియన్, లుంగీ మాత్రమే ఉన్నాయని తెలిపారు. తలపై గాయాలను గుర్తించారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం వరకు వ్యక్తి ఆచూకీ లభించలేదు. నిర్మల్ మార్చురీలో మృతదేహాన్ని ఉంచామని, వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సోన్ సీఐ 94409 00679, లక్ష్మణచాంద ఎస్సై 94409 00645లో సంప్రదించాలని కోరారు. కనకాపూర్ సర్పంచి సుక్కు రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.