
TS News: విష సర్పంతో వింత చేష్టలు.. ఆసుపత్రి పాలైన వ్యక్తి
పామును ముద్దాడుతున్న ఆకాశ్
షాపూర్‌నగర్, న్యూస్‌టుడే: విష సర్పంతో ఆటలాడుతూ దాన్ని ముద్దాడి కాటుకు గురైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ (30).. భార్య, ఇద్దరు పిల్లలతో వలస వచ్చి గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మ బస్తీలో ఉంటున్నాడు. స్థానిక క్వారీలో రాళ్లు కొడుతుంటాడు. ఆదివారం రాత్రి జనావాసాల మధ్యకు ఓ విష సర్పం రావడంతో పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న ఆకాశ్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అతను పామును చాకచక్యంగా పట్టుకుని మెడలో వేసుకుని దాన్ని ముద్దాడుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ వింత చేష్టలే అతని ప్రాణాల మీదకు తెచ్చాయి. పామును దూరంగా వదిలిపెట్టిన అనంతరం అతను అస్వస్థతకు గురయ్యాడు. పామును ముద్దాడుతున్న సమయంలో అది కాటు వేసినట్లు అందరూ భావిస్తున్నారు. వెంటనే అతన్ని సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు వైద్యులు తెలిపారు.