
Crime News: కొలువులిప్పిస్తామని రూ. కోటిన్నర స్వాహా!
నిందితులు సురేంద్ర, సురేష్
ఈనాడు, హైదరాబాద్: మెట్రో, దక్షిణ మధ్య రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.కోటిన్నర వసూలు చేసిన కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్‌రెడ్డి(37), దాచిపల్లి సురేష్(33), బానోతు నాగలక్ష్మి(30)లను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కాకరపర్తి భాగ్యలక్ష్మి(60), ఆలం, శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. మంగళవారం నేరెడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో నేరవిభాగం డీసీపీ యాదగిరి, మల్కాజిగిరి ఏసీపీ ఎం.శ్యాంప్రసాద్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ జి.నవీన్‌కుమార్‌తో కలిసి సీపీ మహేశ్‌భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడి పేరు కాకరపర్తి సురేంద్ర. ఖమ్మం జిల్లా మధిర స్వస్థలం. పదో తరగతి వరకు చదివి ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. 2012లోనే ఇంగ్లండ్ నుంచి బంగారం బిస్కెట్లు తక్కువ ధరకు తెప్పిస్తానంటూ స్నేహితుల వద్ద రూ.12 లక్షలు వసూలు చేశాడు. 2013లో ఉప్పల్‌కు వచ్చి క్యాబ్ డ్రైవర్‌గా అవతారమెత్తాడు. పుట్టా సురేష్‌రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్‌కార్డు తెచ్చుకున్నాడు. భార్య నాగలక్ష్మి, సహాయకుడు దాచిపల్లి సురేష్‌లతో కలిసి మోసాలకు తెరలేపాడు. రైల్వేలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు, సికింద్రాబాద్‌కు చెందిన ఆలంతో ప్రచారం చేయించారు. నిరుద్యోగులను రైల్వే నిలయం వద్దకు తీసుకెళ్లి.. ఆలం, శ్రీనివాసరావులను రైల్వే అధికారులుగా పరిచయం చేశారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.5-10 లక్షలు వసూలు చేశారు. కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. నెలల గడుస్తున్నా ఉద్యోగం లేకపోవటంతో బాధితులు ఆరా తీయగా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్గా తేలింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూత్రధారి సురేంద్ర 60-70 సిమ్‌కార్డులు ఉపయోగించినట్లు గుర్తించారు. మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ బృందం, మేడిపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 15-20 మంది నిరుద్యోగుల నుంచి రూ.1.5-2 కోట్ల వరకు వసూలు చేసిన సురేంద్ర నాలుగు కార్లను కొనుగోలు చేసి ఉప్పల్‌లో ఓం సాయి ట్రావెల్స్, ఓం సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయాలు ప్రారంభించాడు. జడ్చర్ల వద్ద రూ.25 లక్షలతో క్యాంటీన్ ప్రారంభించాడు. బోడుప్పల్ వద్ద తల్లి పేరిట రూ.40 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశాడు.