Suicide: నువ్వు లేక నేనూ లేను.. నవ దంపతుల బలవన్మరణం

క్షణికావేశం నవ దంపతుల ప్రాణాలు బలి తీసుకుంది. ఎన్నెన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నలభై రోజుల్లోనే బలవన్మరణాలకు పాల్పడేలా చేసింది. బంధుమిత్రులకు తీవ్ర విషాదం మిగిల్చింది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు

Updated : 07 Feb 2022 09:24 IST

మద్దిపాడు, మేదరమెట్ల- న్యూస్‌టుడే: క్షణికావేశం నవ దంపతుల ప్రాణాలు బలి తీసుకుంది. ఎన్నెన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నలభై రోజుల్లోనే బలవన్మరణాలకు పాల్పడేలా చేసింది. బంధుమిత్రులకు తీవ్ర విషాదం మిగిల్చింది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన పొదిలి శ్రీమన్నారాయణ, రమణమ్మ దంపతుల కుమారుడు మహానంది(30). ఇతను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాయ్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ప్రియాంక(24)తో గత ఏడాది డిసెంబర్‌ 28న వివాహమైంది. సంక్రాంతి తర్వాత ప్రియాంకను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి విధులకు వెళ్లారు. ఇటీవల కానిస్టేబుళ్ల భర్తీ ప్రకటన విడుదల కావడంతో పరీక్షలకు సిద్ధం కావాలని మహానంది చరవాణిలో భార్యను కోరారు. ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు సంభాషణ సాగిందని ఇద్దరి తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 4న ప్రియాంక పుట్టింటిలో గాలిపంకాకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న మహానంది.. శనివారం సాయంత్రం విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి బస్సులో ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒంగోలు వచ్చారు.

భార్య లేని జీవితం వద్దంటూ...

ఒంగోలు చేరుకున్న మహానంది తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేనని.. ఇక మీదట మీ దగ్గరకు రానని చెప్పారు. ఆందోళన చెందిన వారు అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం ఉదయం 5 గంటల సమయంలో వాసు అనే స్నేహితుడి చరవాణికి తాను గుండ్లకమ్మ జలాశయం దగ్గర ఉన్నానని.. చనిపోతున్నట్టు మహానంది సంక్షిప్త సందేశం పంపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హుటాహుటిన జలాశయం వద్దకు చేరుకున్నారు. ఒడ్డున మహానంది బ్యాగ్, బూట్లు, చరవాణి, గుర్తింపు కార్డులు, ఫొటోలు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఒంగోలు, అద్దంకి అగ్నిమాపక సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని బోట్ల సహాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో మహానంది మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల వ్యవధిలోనే నవ దంపతులు బలవన్మరణాలకు పాల్పడటంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఎస్సై శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని