Crime News: నెట్‌ఫ్లిక్స్‌లోని వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో కిడ్నాప్‌లు.. ఐదుగురి రిమాండ్‌

అమ్మాయిలతో మాట్లాడాలనుకునే యువకులు.. విద్యార్థులను మాయమాటలతో ఆకర్షించి.. ఫలానా ప్రాంతానికి రావాలని కిడ్నాప్‌ చేసి, డబ్బు లాక్కుని

Updated : 16 Feb 2022 06:46 IST

అపహరించేందుకూ ఓ కంపెనీ

బాధితులను ఆకర్షించేందుకు యువతితో మాటామంతి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఆసిఫ్‌నగర్‌: అమ్మాయిలతో మాట్లాడాలనుకునే యువకులు.. విద్యార్థులను మాయమాటలతో ఆకర్షించి.. ఫలానా ప్రాంతానికి రావాలని కిడ్నాప్‌ చేసి, డబ్బు లాక్కుని వదిలేస్తున్న ముఠాను ఆసిఫ్‌నగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నాయకుడు గుంజపోగు సురేశ్‌ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏడాదిగా వీరు ఆరుగురిని అపహరించారు. పదిరోజుల క్రితం గుడిమల్కాపూర్‌లో ప్రశాంత్‌ అనే యువకుడికి కిడ్నాప్‌ చేసినట్లు అతడి సోదరి ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తులో వారి నేరాలు వెలుగు చూశాయని పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ వివరించారు.

ఉద్యోగులను నియమించుకుని..

అత్తాపూర్‌లో ఉంటున్న సురేశ్‌(27) చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రెండేళ్ల క్రితం బయటకు వచ్చాడు. విభిన్నంగా నేరాలు చేయాలన్న లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్‌లో అతడు చూసిన మనీహెయిస్ట్‌ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో కిడ్నాప్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది జనవరిలో మెహిదీపట్నంలోని భోజగుట్టలో నివాసముంటున్న రోహిత్‌, ఇందూరి జగదీశ్‌, కునాల్‌ను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. యువకులు, విద్యార్థుల ఫోన్‌ నంబర్లు సేకరించాడు. వారితో మాట్లాడేందుకు జగద్గిరిగుట్టలో నివాసముంటున్న శ్వేతాచారిని ఒప్పించాడు. కిడ్నాప్‌ చేసేందుకు సెకెండ్‌ హ్యాండ్‌ కారు కొని.. అపహరణలు ప్రారంభించారు.

* ఒకటి, రెండ్రోజులు బాధితులతో శ్వేతాచారి ద్వారా వాట్సప్‌లో మాట్లాడించాక ఫలానా ప్రాంతానికి రావాలంటూ ఫోన్‌లో చెప్పేవారు. బాధితుడు రాగానే అప్పటికే కారులో ఉన్న రోహిత్‌, కునాల్‌ అతడిని కారులో ఎక్కించుకుంటారు. బెదిరించి అతడి కుటుంబ సభ్యులకు డబ్బు కోసం ఫోన్‌ చేయిస్తారు. లేదంటే చంపేస్తామంటూ చెబుతారు. అతడి డెబిట్‌కార్డులో నగదు వేయించి.. సమీపంలో ఏటీఎం కేంద్రానికి తీసుకెళ్లి విత్‌డ్రా చేసుకుంటారు.

* డబ్బు తీసుకోవడం కూడా కొత్త పద్ధతుల్లో తీసుకునేవారు. ప్రశాంత్‌ను కిడ్నాప్‌ చేసిన సురేశ్‌ ముఠా.. కుటుంబీకులను డబ్బు తీసుకుని బాహ్యవలయ రహదారి సమీప ఓ వంతెన వద్దకు రమ్మన్నారు. అక్కడ కారులో కిడ్నాపర్లు ఉండగా.. ప్రశాంత్‌ సోదరులు తెచ్చిన రూ.50 వేలను వంతెన పైనుంచి తాడు వేసి దానికి కట్టించి తీసుకున్నారు.

పోలీస్‌.. పవన్‌కల్యాణ్‌ టాటూలు

కారును చాకచక్యంగా వేగంగా నడిపే సరేశ్‌ వ్యవహారశైలి చిత్రంగా ఉందని పోలీసులు తెలిపారు. ఒక చేతికి పోలీస్‌.. మరోచేతికి పవన్‌కల్యాణ్‌ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. విలాసంగా జీవించాలని, కారుల్లో తిరగాలన్నది సురేశ్‌ ఆశ. అందుకే గదిలో కాకుండా కారులోనే పడుకుంటాడని వివరించారు. ఆసిఫ్‌నగర్‌ పోలీసులు అతడు కారులో పడుకున్నప్పుడు చుట్టూ ఐదు డీసీఎంలను ఉంచి అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని