Road Accident: ఇంటికొస్తున్నానంటూ తల్లికి ఫోన్‌ చేసి అంతలోనే దుర్మరణం..

పని మీద కొత్తకోటకు వచ్చానని.. ఓ పావుగంటలో ఇంటికి వస్తానని చరవాణి ద్వారా తల్లికి సమాచారమిచ్చిన  కుమారుడు ఇంటికి సమీపంలోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. కన్నకొడుకు కోసం ఎదురుచూస్తున్న

Updated : 28 Feb 2022 08:27 IST

మృతుడు మంత్రి నిరంజన్‌రెడ్డి కారు డ్రైవర్‌

ఖాదర్‌పాషా  

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : పని మీద కొత్తకోటకు వచ్చానని.. ఓ పావుగంటలో ఇంటికి వస్తానని చరవాణి ద్వారా తల్లికి సమాచారమిచ్చిన  కుమారుడు ఇంటికి సమీపంలోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. కన్నకొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడనే సమాచారం గుండెలను పిండేసింది. హృదయవిదారకమైన ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వనపర్తి పట్టణం పాతకోటకు చెందిన ఖాదర్‌పాషా (29) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వద్ద కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం కొత్తకోటకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అనంతరం తల్లిదండ్రులు జహేరాబేగం, యూసుఫ్‌లతో చరవాణి ద్వారా మాట్లాడుతూ వనపర్తికి బయలుదేరానని 15 నిముషాల్లో వస్తానని చెప్పా. పట్టణ శివారు నాగవరం కొత్తకోటరోడ్డులోని రైస్‌మిల్లు వద్ద అతన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ప్రమాద సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ముందుగా గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఖాదర్‌పాషాగా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సమాచారమిచ్చారు. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆయన సతీమణి వాసంతి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఖాదర్‌పాషాకు భార్య సమీరాబేగం, నెల రోజుల వయస్సున్న కుమారుడు ఉన్నారు. పుర అధ్యక్షుడు గట్టు యాదవ్‌, ఉపాధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌, పురపాలిక మాజీ అధ్యక్షుడు రమేష్‌గౌడు, మాజీ కౌన్సిలర్‌ ఉంగ్లం తిరుమల్‌ తదితరులు ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఠాణా ఎస్సై చంద్రమోహన్‌రావు తెలిపారు.

ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు, నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని