నిండు ప్రాణాన్ని బలిగొన్న గోతులు

కోరుకున్న అమ్మాయిని మనువాడి కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. భార్య కుమారి అయిదు నెలల గర్భిణి. మరో నాలుగు నెలలు గడిస్తే తమ ప్రేమకు ప్రతి రూపం అయిన పండంటి బిడ్డ జన్మించే మధుర క్షణాల కోసం

Updated : 01 Mar 2022 05:17 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

అశోక్‌ (పాతచిత్రం)

పద్మనాభం, న్యూస్‌టుడే: కోరుకున్న అమ్మాయిని మనువాడి కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. భార్య కుమారి అయిదు నెలల గర్భిణి. మరో నాలుగు నెలలు గడిస్తే తమ ప్రేమకు ప్రతి రూపం అయిన పండంటి బిడ్డ జన్మించే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముంచుకురావడంతో బిడ్డను చూసే భాగ్యానికి నోచుకోకుండానే ఆ తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. పద్మనాభం-సింహాచలం మార్గంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం బి.సి.కాలనీకి చెందిన కుప్పిలి అశోక్‌ (27) కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై మద్ది నుంచి ఆనందపురం వెళ్తుండగా మద్ది కూడలి దాటిన వెంటనే విశాఖ డెయిరీ బల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ సమీపంలో రోడ్డుపై ఉన్న గోతులను తప్పించే క్రమంలో అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించి ఉన్నా బలమైన అంతర్గత గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుకు బలంగా తాకడంతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అశోక్‌ తల్లిదండ్రులు నర్సయమ్మ, తిరుపతిరావులకు ఇతను రెండో సంతానం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ అప్పలరాజు పేర్కొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని