Crime News: ‘అల్లరిపిల్ల’ మోసగాళ్ల అరెస్టు

ఫేస్‌బుక్‌లో ‘అల్లరి పిల్ల’ ఖాతా ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని తియ్యటి మాటలతో ముగ్గులోకి దించి వారితో అర్ధనగ్న వీడియో కాల్‌ మాట్లాడి...

Updated : 09 Mar 2022 07:13 IST

రూ.2.50 లక్షలు నగదు స్వాధీనం

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌లో ‘అల్లరి పిల్ల’ ఖాతా ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని తియ్యటి మాటలతో ముగ్గులోకి దించి వారితో అర్ధనగ్న వీడియో కాల్‌ మాట్లాడి ఆపై చరవాణిని హ్యాక్‌చేసి నగదు కాజేసే ఎనిమిది మంది సభ్యుల మోసగాళ్ల ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై చిత్తూరు టూటౌన్‌ స్టేషన్‌లో మంగళవారం డీఎస్పీ సుధాకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.చిత్తూరుకు చెందిన సీకే మౌనిక్‌ అల్లరిపిల్ల వలలో పడి రూ.3,64,227 మోసపోయాడు. అతడి ఫిర్యాదుతో ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాల మేరకు టూటౌన్‌ సీఐ యుగంధర్‌ సారధ్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఫేస్‌బుక్‌లో అల్లరిపిల్ల ప్రొఫైల్‌ సృష్టించి కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించాం. ఆ ఖాతా ద్వారా వీరు అమాయకులను ఆసరాగా చేసుకుని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి వాటిని అంగీకరించిన వెంటనే ఖాతా ప్రొఫైల్‌ ఫొటోలోని మహిళ మెసేజ్‌ చాట్‌ చేస్తుంది. క్రమేపీ వీడియో చాట్‌కు ఆహ్వానించి లింకు పంపుతుంది. దాన్ని క్లిక్‌ చేయగానే ఫొటోలోని మహిళ అర్ధనగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడి అవతలి వ్యక్తి చరవాణి ఆపరేటింగ్‌ యాక్సిస్‌ను తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఆపై అతడు చరవాణిలో ఏం టైప్‌ చేసినా, ఆ మహిళ వాటిని చూసే వెసులుబాటు ఉంటుంది. నగరానికి చెందిన సీకే మౌనిక్‌ ఇదేరీతిన లింక్‌ను క్లిక్‌ చేసి మహిళతో వీడియో కాల్‌ మాట్లాడాడు. అతడి ఖాతా వివరాల ఆధారంగా రూ.3,64,227ను నాలుగు విడతలుగా తస్కరించి దాన్ని ముఠాలోని ఇతర సభ్యులకు పంపింది. అతడు దీనిపై ఈ నెల మూడోతేదీన ఫిర్యాదు చేశాడు. ఐదు రోజుల్లోనే అల్లరిపిల్ల మోసగాళ్లను గుర్తించాం. మంగళవారం విశాఖపట్నంకు చెందిన అడప సాంబశివరావు(32), ఆనంద్‌మెహతా(35), గొంతెన శ్రీను(21), చందపరపు కుమార్‌రాజా(21), లోకిరెడ్డి మహేష్‌(24), గొంతెన శివకుమార్‌(21), వరంగల్‌కు చెందిన తోట శ్రావణ్‌కుమార్‌(31), కడపకు చెందిన చొప్ప సుధీర్‌కుమార్‌ అలియాస్‌ సుకు అలియాస్‌ హనీ(30)ని అరెస్టు చేసి వారి నుంచి రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నా’మని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో ముపట్ల మానస అలియాస్‌ అల్లరిపిల్ల పరారీలో ఉందని చెప్పారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన సీఐ యుగంధర్‌, ఎస్సైలు మల్లికార్జున, లోకేశ్‌ను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని