Hyderabad News: సైబర్‌ దొంగలకు పోలీసుల ఝలక్‌!

సైబర్‌ నేరగాళ్లకే పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. ఓ పేమెంట్‌ గేట్‌వే సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేసి కొట్టేసిన రూ.51 లక్షలతో పాటు ఆ మోసగాడి ఖాతాలో ఉన్న మరో రూ.49 లక్షలు.. మొత్తం రూ.కోటి ఫ్రీజ్‌ చేయించారు. బాధిత సంస్థ యాజమాన్యం సకాలంలో

Published : 18 Mar 2022 07:07 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్లకే పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. ఓ పేమెంట్‌ గేట్‌వే సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేసి కొట్టేసిన రూ.51 లక్షలతో పాటు ఆ మోసగాడి ఖాతాలో ఉన్న మరో రూ.49 లక్షలు.. మొత్తం రూ.కోటి ఫ్రీజ్‌ చేయించారు. బాధిత సంస్థ యాజమాన్యం సకాలంలో ‘నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌(ఎన్‌సీసీఆర్‌పీ)’లో ఫిర్యాదు చేయడంతోనే ఇది సాధ్యమైందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణా ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌లో ‘ఎక్స్‌ సిలికా సాఫ్ట్‌వేర్‌ సోల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే ‘పేమెంట్‌ గేట్‌వే’ సంస్థ ఉంది. ఓ సైబర్‌ దొంగ ఇందులో ఖాతాదారుడిగా చేరాడు. సంస్థ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను పసిగట్టి, సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.51 లక్షలు దోచేశాడు. అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే ఎన్‌సీసీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు దోచిన సొమ్ము ఏ బ్యాంక్‌ ఖాతాలో జమా అయిందో తెలుసుకొని, ఆ ఖాతాను ఫ్రీజ్‌ చేయించారు. దీంతోపాటు అప్పటికే ఆ ఖాతాలో ఉన్న మరో రూ.49 లక్షలనూ ఫ్రీజ్‌ చేశారు. ఈ సొమ్ము కూడా ఇతరుల నుంచి కొట్టేసిందే అని చెబుతున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఓ గేట్‌వే సంస్థకు సంబంధించి రూ.1.20 కోట్లు కొట్టేశారు. సకాలంలో ఫిర్యాదు చేయకపోవడంతో ఆ సొమ్మును కాపాడలేకపోయామన్నారు. ఎవరైనా ఇలా సొమ్ము పోగొట్టుకుంటే ఎన్‌సీసీఆర్‌పీ నంబరు 155260లో, www.cybercrime.gov.in  లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని