Telangana News: అక్క భర్తే ‘కాలయముడు’

పెద్ద దిక్కులేని అత్తగారింట్లో బాగోగులు చూసుకోవాల్సిన అల్లుడే మరదలు పాలిట కాలయముడయ్యాడు. భార్య చెల్లెలిపై కన్నేసి ఆమె జీవితాన్ని బలిగొన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోపాటు ...

Updated : 26 Mar 2022 06:48 IST

ఏన్కూరు, న్యూస్‌టుడే: పెద్ద దిక్కులేని అత్తగారింట్లో బాగోగులు చూసుకోవాల్సిన అల్లుడే మరదలు పాలిట కాలయముడయ్యాడు. భార్య చెల్లెలిపై కన్నేసి ఆమె జీవితాన్ని బలిగొన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోపాటు వేధింపులకు గురిచేయడంతో గత్యంతరం లేని స్థితిలో యువతి పురుగు మందు తాగి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్‌నాయక్‌ తండాలో చోటు చేసుకొన్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తండాకు చెందిన గుగులోతు శ్రీను, చిన్ని దంపతులకు ఐదుగురు కుమార్తెలున్నారు. శ్రీను కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో కుటుంబ భారం చిన్నిపై పడింది. తండాలో వ్యవసాయం చేస్తూ కుమార్తెలను చదివించి పెళ్లిళ్లు చేస్తూ వస్తోంది. ఐదుగురిలో నలుగురికి వివాహం చేసింది. చిన్న కుమార్తె ప్రమీల(22) ఖమ్మంలో పీజీ చదువుతోంది. ఆమెకు కూడా పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలనుకుంది. విజయవాడ సమీపంలోని ఓ యువకుడితో నిశ్చితార్ధం చేసి ఏప్రిల్‌ 10న వివాహానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. చిన్ని మూడో అల్లుడు ఖమ్మానికి చెందిన సంతోశ్‌ కొన్నాళ్లుగా ప్రమీలను తననే పెళ్లి చేసుకోవాలని బెదిరించడం, అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నాడు. తండాలో ఉండలేక తల్లికూతుళ్లు మరో కుమార్తె ఇంటికి వెళ్లినా అక్కడకు వెళ్లి వేధిస్తున్నాడు. ఇవన్నీ భరించలేక మనస్థాపం చెందిన ప్రమీల ఈ నెల 22న రాత్రి 12గంటల సమయంలో ఇంట్లో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిసేపటికి వాంతులు చేసుకుంటున్న కుమార్తెను చూసి వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇక లేదని తెలుసుకుని ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. చిన్ని ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని