Updated : 30 Mar 2022 13:49 IST

Crime News: అపురూప వివాహం.. ‘అంతులేని విషాదం’

ఎలక్ట్రానిక్‌ సిటీ, తుమకూరు, న్యూస్‌టుడే : అపురూప వివాహమని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించిన వారి వివాహ జీవితంలో అంతులేని విషాదం అలుముకుంది. భర్త శంకరణ్ణ మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు- హాసన జాతీయ రహదారిలోని కుణిగల్‌ తాలూకా చౌడనకుప్పె గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శంకరణ్ణ ఉరి వేసుకోవడంపై అనేక సందేహాలు సుడులు సుడులుగా తిరుగుతున్నాయి. 

వివరాల్లోకెళ్తే.. చౌడనకుప్పెకు చెందిన శంకరణ్ణ ఓ మోతుబరి రైతు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం ఉండేదికాదు. రైతుగా వివిధ పంటల్ని సాగుచేస్తూ బాగానే సంపాదించారు. నగరవాసులు సైతం ముక్కున వేలేసుకునేలా మంచి బంగళాను నిర్మించారు. వయస్సు మీదపడుతున్నా ఇంకా వివాహం చేసుకోలేందంటూ గ్రామస్థులు తరచూ హేళన చేసేవారు. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయమే తన ప్రధాన కర్తవ్యమనేలా వ్యవహరించేవారు. అలాంటి పరిస్థితుల్లో పొరుగు గ్రామమైన మావత్తూరుకు చెందిన మేఘనా అనే యువతి శంకరణ్ణను పరిచయం చేసుకుంది. అప్పటికే మేఘనాకు వివాహమైంది. భర్త ఇంటి నుంచి పారిపోయి రెండేళ్లైనా తిరిగి ఇంటికి రాలేదు. ఇక రాడని నిర్ధారించుకున్న మేఘనా తనను వివాహం చేసుకోవాల్సిందిగా శంకరణ్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. తనకు ఈ వయస్సులో పెళ్లేమిటని సున్నితంగా తిరిస్కరించినా ఆమె నుంచి ఒత్తిడి అధికమయ్యేసరికి చివరకు ఒప్పుకొన్నారు. పొరుగూరిలోని ఓ ఆలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెద్దాయనకు.. 25 ఏళ్ల యువతితో వివాహం అంటూ గ్రామస్థులే కాకుండా సామాజిక మాధ్యమాలు కూడా హేళన చేయడం ప్రస్తావనార్హం. ఆస్తి కోసమే ఈ వివాహమంటూ అనేక మంది విమర్శలు చేశారు. అవేమీ పట్టించుకోకుండా శంకరణ్ణ తన భార్యను అపురూపంగా చూసుకునేవారు. ఇలాంటి సందర్భంలో అంతులేని విషాదం అలుముకుంది. 

బెంగళూరులో కాపురమా..?: బెంగళూరులో కాపురం పెట్టాలని మేఘనా ఒత్తిడి చేసేదని శంకరణ్ణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉన్న ఆస్తిని విక్రయించి బెంగళూరులో స్థిరపడాలని ఆమె తరచూ పోట్లాడేదని వివరించారు. ఒకవైపు వృద్ధురాలైన తల్లిని కాదని భార్య మాటలు విని ఆస్తిని ఎలా విక్రయించాలని తీవ్రంగా మదనపడినట్లు తెలిసింది. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులిద్దరూ పోట్లాడినట్లు ఇరుగు పొరుగువారు తెలిపారు. ఇంటి నుంచి కోపంగా బయటకు వెళ్లిన శంకరణ్ణ మంగళవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించారు. హులియూరు దుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శంకరణ్ణ శవం వద్ద ఓ లేఖను గుర్తించినట్లు తెలిసింది. అందులో ఏముందో దర్యాప్తులోనే వెల్లడికావాల్సి ఉంది.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని