Hyderabad News: గోవాకు వెళ్లి.. తీవ్ర గాయాలతో తిరిగొచ్చి..

హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్లిన బోరబండకు చెందిన టెంపో డ్రైవర్‌ శ్రీనివాస్‌ తీవ్రగాయాలతో ఇంటికి చేరుకున్నాడు. తల, పొట్ట భాగంలో కుట్లు ఉండటంతో అతని పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు

Updated : 06 Apr 2022 03:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్లిన బోరబండకు చెందిన టెంపో డ్రైవర్‌ శ్రీనివాస్‌ తీవ్రగాయాలతో ఇంటికి చేరుకున్నాడు. తల, పొట్ట భాగంలో కుట్లు ఉండటంతో అతని పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురై పోలీసులకు, బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌కు చెప్పి నిమ్స్‌కు తరలించారు. మత్తు మందు ఇచ్చి ఎవరో అతని అవయవాలు తీసుకున్నట్లు తొలుత అనుమానించారు. అయితే పరీక్షలు చేసిన అత్యవసర విభాగం వైద్యులు కాదని తేల్చారు. ఏదైనా ప్రమాదం జరిగి శస్త్రచికిత్స చేసి కుట్లు వేసి ఉంటారని చెప్పారు. గతనెల 19న 10 మంది ప్రయాణికులను తీసుకొని గోవా వెళ్లాడు. అక్కడి వారిని దించి ఇప్పుడే వస్తానని వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ప్రయాణికులు అతని కుటుంబికులకు చెప్పడంతో వారు గోవా వెళ్లి గాలించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 17 రోజుల తర్వాత శ్రీనివాస్‌ తిరిగి ఇంటికి రావడంతో అతని రూపం చూసి ఆందోళనకు గురయ్యారు. గుర్తు పట్టలేని స్థితిలో మెడభాగం దగ్గర, పొట్టకు కుట్లు వేసి ఉన్నాయి. ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు. కాగా శ్రీనివాస్‌ షాక్‌లో ఉండటంతో వివరాలు సరిగా చెప్పలేకపోతున్నాడు. పూర్తిగా కోలుకుంటే అసలు విషయం తెలిసే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని