Updated : 06 Apr 2022 08:40 IST

Andhra News: నాలుగేళ్లుగా మిస్టరీ.. తాగిన మైకంలో నిజం చెప్పేశాడు!

వీడిన విద్యార్థి హత్య కేసు మిస్టరీ

చాగల్లు, న్యూస్‌టుడే: క్రికెట్‌ ఆడే సమయంలో ఓ విద్యార్థి, ముగ్గురు భవన నిర్మాణ కూలీలకూ మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం బాగానే సాగింది. ఓరోజు వారి మధ్య జరిగిన గొడవలో ఆ విద్యార్థి హత్యకు గురయ్యారు. మృతదేహం కనిపించలేదు. అప్పటి నుంచి ఆ కుర్రాడి ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత ఇటీవల హంతకుల్లో ఒకరు మద్యం మత్తులో  ఈ విషయం చెప్పడంతో నిజం బయటపడింది.

మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన పి.శ్రీహర్ష(17) 2018లో వేలివెన్నులోని ఓ కళాశాలలో ఇంటర్‌  చదువుతున్నాడు. అదే ఏడాది దీపావళికి దారవరంలోని తాతయ్య శ్యామ్‌సన్‌ ఇంటికి వచ్చాడు. అంతకుముందు నుంచే క్రికెట్‌లో స్నేహితులైన నిర్మాణ కూలీలు షేక్‌ రషీద్, ఆదిత్య, మునీంద్రలతో కలిసి నిడదవోలు జూనియర్‌ కళాశాలకు ఆడుకొనేందుకు వెళ్లారు. వీరి మధ్య తగాదా నెలకొనడంతో పథకం ప్రకారం శ్రీహర్షను ఆ ముగ్గురూ కలిసి మెడకు తాడు బిగించి హతమర్చారు. శవం కనిపించకుండా కళాశాలలోని వినియోగంలో లేని సెప్టిక్‌ ట్యాంక్‌లో దాచిపెట్టారు. ఏడాది తరువాత ఆ ముగ్గురూ 2019లో కళేబరాన్ని బయటకు తీసి, నిడదవోలు రైల్వే గేటు సమీపంలోని కాలువలో పడేశారు. 2018లోనే శ్రీహర్ష అదృశ్యంపై తండ్రి రత్నకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి అదో మిస్టరీలా మిగిలిపోయింది. కాగా ఇటీవల రషీద్‌ తాగిన మైకంలో తనతో జాగ్రత్తగా ఉండాలని.. తనో హత్య చేసినట్లు మిత్రులను హెచ్చరించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయట పడింది. రషీద్‌ను అరెస్టు చేశారు. ఆదిత్య, మునీంద్ర పరారీలో ఉన్నారు. డీఎస్పీ శ్రీనాథ్‌ నిడదవోలు కళాశాలలోని సెప్టిక్‌ ట్యాంక్‌లో మరికొన్ని ఎముకలను గుర్తించారు. ఎస్సై రమేష్‌ దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని