మిస్టరీగా గోవా బాధితుడి కేసు.. ఆ రోజు అతని జేబులో ఎంఎంటీఎస్‌ టికెట్‌..!

నగరం నుంచి గోవాకు పర్యాటకులను తీసుకువెళ్లి తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న బోరబండ బంజారానగర్‌కు చెందిన టెంపో డ్రైవర్‌ గజ్వెల్లి శ్రీనివాస్‌ కేసు మిస్టరీగా మారింది. తల, పొట్టపై శస్త్రచికిత్స జరిగిన ఆనవాళ్లు ఉండటంతో గోవాలో అసలేం జరిగిందన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు

Published : 09 Apr 2022 07:30 IST

డ్రైవర్‌ శ్రీనివాస్‌తో మాట్లాడుతున్న గోవా పోలీసులు

బోరబండ, న్యూస్‌టుడే: నగరం నుంచి గోవాకు పర్యాటకులను తీసుకువెళ్లి తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న బోరబండ బంజారానగర్‌కు చెందిన టెంపో డ్రైవర్‌ గజ్వెల్లి శ్రీనివాస్‌ కేసు మిస్టరీగా మారింది. తల, పొట్టపై శస్త్రచికిత్స జరిగిన ఆనవాళ్లు ఉండటంతో గోవాలో అసలేం జరిగిందన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. రెండు రోజుల పాటు నిమ్స్‌లో చికిత్స పొందిన శ్రీనివాస్‌ ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి చేరుకున్నాడు. గోవా రాష్ట్రం అంజునా పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌.ఐ. తేజస్‌తో పాటు ముగ్గురు సభ్యుల బృందం నగరానికి వచ్చి శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపింది.

19న గోవాకు.. ఘట్‌కేసర్‌ ప్రాంతంలోని మణికంఠ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేసే గజ్వెల్లి శ్రీనివాస్‌ 10 మంది పర్యాటకులతో కలిసి గతనెల 19న గోవాకు వెళ్లాడు. వారిని అక్కడ ఓ లాడ్జి వద్ద వదిలి ఇప్పుడే వస్తానని వెళ్లి తిరిగి రాలేదు. 17రోజుల తర్వాత ఇంటికి తిరిగి రావడంతో కుటుంబీకులు ఆశ్చర్యానికి గురయ్యారు. తలపై 52, కడుపుపై 62కుట్లు ఉండటంతో స్థానిక కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ మాజీఉపమేయర్‌ ఎం.డి.బాబాఫసియుద్దీన్‌ సహకారంతో నిమ్స్‌లో చికిత్స పొందాడు. అన్ని కుట్లతో ఉన్న వ్యక్తి ఒంటరిగా గోవా నుంచి నగరానికి ఎలా చేరుకున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. శ్రీనివాస్‌ ఇంటికి వచ్చినరోజు అతని జేబులో హఫీజ్‌పేట నుంచి బోరబండ రైల్వేస్టేషన్‌ వరకు తీసుకున్న ఎంఎంటీఎస్‌ టికెట్‌ ఉంది.

అదృశ్యం కేసు.. అంజునా పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనివాస్‌ అదృశ్యం కేసు నమోదు కావడంతో విచారణ నిమిత్తం శుక్రవారం నగరానికి వచ్చిన గోవా పోలీసుల బృందం ఎస్‌.ఆర్‌.నగర్‌, పంజాగుట్ట పోలీసులతో కలిసి నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. రెండు రోజుల పాటు చికిత్స పొంది ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు ఆస్పత్రి ఆర్‌ఎంఓలు పోలీసులకు తెలిపారు. చికిత్సకు సంబంధించి బిల్లు సైతం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. రాత్రి 8గంటల సమయంలో బోరబండ బంజారానగర్‌లోని శ్రీనివాస్‌ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు కేసును దర్యాప్తు చేస్తామని గోవా అంజునా పోలీస్‌స్టేషన్‌ ఎస్‌.ఐ. తేజస్‌ వెల్లడించారు. శ్రీనివాస్‌కు భార్య జి.జ్యోతి, ఇద్దరు పిల్లలు జి.శాంభవి, జి.సాయిమణికంఠ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని