Hyd News: భార్యాపిల్లల్ని వదిలెల్లి.. ఖరీదైన ప్రియురాలితో లబోదిబోమన్న బాధితుడు

ప్రియురాలి ఆకర్షణలో చిక్కిన ఓ ప్రబుద్ధుడు.. భార్యాపిల్లల్ని వదిలేసి ఆమెతో వెళ్లిపోయాడు. కొన్నినెలల తరువాత వాస్తవం బోధపడి.. కట్టుకున్న భార్యే ముద్దంటూ.. ఎలాగైనా తమను కలపాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.

Updated : 18 Apr 2022 06:53 IST

ఈనాడు, హైదరాభాద్‌: ప్రియురాలి ఆకర్షణలో చిక్కిన ఓ ప్రబుద్ధుడు.. భార్యాపిల్లల్ని వదిలేసి ఆమెతో వెళ్లిపోయాడు. కొన్నినెలల తరువాత వాస్తవం బోధపడి.. కట్టుకున్న భార్యే ముద్దంటూ.. ఎలాగైనా తమను కలపాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఆ భార్య మాత్రం ఇతగాడితో ఉండలేనంటూ తేల్చి చెప్పింది. కూకట్‌పల్లికి చెందిన భార్యభర్తలిద్దరూ ఉద్యోగులు.  ఆర్థికంగా లోటు లేని జీవితం. ఇద్దరు పిల్లలతో సజావుగా సాగుతున్న సంసారం. గతేడాది భర్తకు ఓ వివాహితతో పరిచయమైంది. సెల్‌ఫోన్‌లో గంటలకొద్దీ మాటలు.. వాట్సాప్‌లో అర్ధరాత్రి దాటాక ఛాటింగ్‌లు.. వెరసి 2 నెలల క్రితం.. ఇద్దరూ ఎటో వెళ్లిపోయారు కూడా. భర్త కనిపించకపోవటంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా అసలు విషయం బయటపడింది. తండ్రి ఎక్కడంటూ పిల్లలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె మౌనం వహిస్తుండేది. ఆ తరువాత.. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దిల్లీ వెళ్లాడంటూ చెబుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం అతడు.. అకస్మాత్తుగా సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. తాను అదృశ్యమవ్వలేదని.. క్షణికావేశంలో తప్పు చేశానంటూ ఖాకీల కాళ్లావేళ్లా పడ్డాడు. ఏదోవిధంగా భార్యతో కలసి బతికేలా చూడమంటూ ప్రాధేయపడ్డాడు. అతనికి జ్ఞానోదయం కలగడానికి కారణమేంటా అని ఆరా తీయగా అతనిచ్చిన సమాధానం విని పోలీసు అధికారి విస్తుపోయారు. ప్రియురాలు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ ఖరీదైనవే కావాలనేదట. విలాసవంతమైన జీవితం అస్వాదించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టించటం ప్రారంభించింది. ఆహారం.. దుస్తులు.. వస్తువులు.. రోజువారీ గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు నెలరోజుల్లోనే రూ.10 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందంటూ భోరుమన్నాడట. ఆ ఖర్చులు భరించలేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. పెద్దల ద్వారా భార్యతో రాజీ కుదుర్చుకుందామని ప్రయత్నిస్తే ఆమె ఛీకొట్టింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నాడు. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి కలిపేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు