Telangana News: రెండో పెళ్లిని అడ్డుకున్న మొదటి భార్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలు బస్తీ ఏరియాలో గురువారం సంచలనంగా మారింది.

Updated : 22 Apr 2022 06:44 IST

పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగిన సుజాత (ఎరుపు దుస్తులు)

ఇల్లెందు, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలు బస్తీ ఏరియాలో గురువారం సంచలనంగా మారింది. బాధితురాలు జాలాది సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సుజాత, ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలుబస్తీ ఏరియాకు చెందిన బి.వంశీ 2013లో ప్రేమించుకుని, 2017లో ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారక తిరుమల ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో వంశీ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కొవ్వూరు పోలీసు స్టేషనులో కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు కోర్టులో కొనసాగుతుంది. అయితే వంశీ పట్టణంలోని సబ్‌జైలుబస్తీకి చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. గురువారం స్థానిక 24 ఏరియా సింగరేణి వైసీఓఏ క్లబ్‌లో ఉదయం 9 గంటలకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పెళ్లిని అడ్డుకునేందుకు వైసీఓఏ క్లబ్‌ వద్దకు వచ్చి ఎవరూ లేకపోవడంతో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు ఇళ్ల వద్దకు వెళ్లారు. ఈక్రమంలో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు సుజాతకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బాధితురాలు మాట్లాడుతూ కోర్టులో కేసు ఉండగా, విడాకులు తీసుకోకుండా ఎలా మరో పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు సిబ్బందిని పంపించి బాధితురాలిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. కేసు కోర్టులో ఉన్నందున తాము ఏమీ చేయలేమని తెలపడంతో బాధితురాలు చేసేదేమిలేక వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వెళ్లిపోయారు.

* సుజాతకు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు వాగ్వివాదం జరుగుతుండగా, ముందస్తుగా సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పెళ్లిని వైసీఓఏ క్లబ్‌లో కాకుండా గోప్యంగా ఇంట్లోనే చేశారు. పెళ్లి జరగలేదని ప్రచారం చేశారు. వారిని నమ్మి పోలీసు స్టేషనుకు వెళ్లిన సుజాతకు పెళ్లి జరిగినట్లు ఆలస్యంగా తెలియడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని