వ్యాపారి హత్యతో అట్టుడికిన బేగంబజార్‌!

యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ హత్యతో బేగంబజార్‌ ప్రాంతం అట్టుడికి పోయింది. బేగంబజార్‌ కోల్సావాడీకి చెందిన యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Updated : 22 May 2022 05:49 IST

బేగంబజార్‌లో మూత పడిన దుకాణాలు

గోషామహల్‌, న్యూస్‌టుడే: యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ హత్యతో బేగంబజార్‌ ప్రాంతం అట్టుడికి పోయింది. బేగంబజార్‌ కోల్సావాడీకి చెందిన యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన సంజన కుటుంబీకుల్లోని కొందరు శుక్రవారం రాత్రి బేగంబజార్‌ చేపల మార్కెట్‌ వద్ద నీరజ్‌ పన్వర్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే.

మార్కెట్‌ బంద్‌.. పీఎస్‌ ముందు ధర్నా..

హత్యకు నిరసనగా హైదరాబాద్‌ కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌, బేగంబజార్‌ రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బేగంబజార్‌లో వ్యాపారులందరూ దుకాణాలు తెరవలేదు. ఉదయం పదిన్నర గంటలకు బేగంబజార్‌ మిట్టీకా షహర్‌ నుంచి వందలాది మంది వ్యాపారులు, బాధితుడి కుటుంబసభ్యులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టి షాయినాయత్‌గంజ్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధితుడి కుటుంబీకులు, బంధువులతో పాటు అతని భార్య సంజన ఈ ధర్నాలో పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీసీపీ డేవిస్‌ జోయల్‌, ఏసీపీ సతీశ్‌కుమార్‌, సీఐ అజయ్‌కుమార్‌లు ఎమ్మెల్యేతో పాటు వ్యాపార సంఘం ప్రతినిధులతో మాట్లాడారు.

నా సోదరులే హత్య చేశారు: సంజన

నా భర్తను మా సోదరులే హత్య చేశారని నీరజ్‌ పన్వర్‌ భార్య సంజన విలపించింది. షాయినాయత్‌గంజ్‌ పీఎస్‌ ఎదురుగా ధర్నాలో పాల్గొన్న ఆమె విలేఖరులతో మాట్లాడింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తాను చేసిన పాపమా..? అని ప్రశ్నించింది. తన భర్తను హతమార్చిన వారందరికీ ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరింది.

* యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ మృతదేహానికి ఉస్మానియాలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

అంతిమయాత్రకు తరలివచ్చిన జనం

హెచ్‌ఆర్‌సీ నోటీసులు

నారాయణగూడ: శుక్రవారం రాత్రి బేగంబజార్‌లో జరిగిన హత్యపై ఎస్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్‌ ఈ కేసును సూమోటోగా విచారణకు స్వీకరించింది.ఈ సంఘటనపై జూన్‌ 30లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

బందోబస్తు మధ్య అంతిమయాత్ర

ఉస్మానియా ఆసుపత్రి: నీరజ్‌ పన్వర్‌ మృతదేహానికి ఫోరెన్సిక్‌ వైద్యురాలు ఝాన్సీ ఆధ్వర్యంలో పరీక్షలు ఉస్మానియాలో నిర్వహించారు. స్థానికుల అభ్యర్థన మేరకు కోల్సావాడీ వద్ద నుంచి అంతిమయాత్ర కాలినడకన బేగంబజార్‌ నుంచి ఇమ్లిబన్‌ శ్మశాన వాటిక వరకూ సాగింది. ఇమ్లిబన్‌ శ్మశాన వాటికలో సాయంత్రం మృతదేహానికి అతని సోదరుడు దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడి కుటుంబీకుల్ని తెరాస రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్‌(బిలాల్‌), ఆనంద్‌ కుమార్‌గౌడ్‌, వ్యాపార సంఘాల ప్రతినిధులు పరామర్శించి ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని