బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణం

స్థానికంగా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం,

Updated : 23 May 2022 05:57 IST

బొల్లి దివ్యవాణి

గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానికంగా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం, మట్లాపూడిలోని ఇండియన్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్‌ బ్యాంక్‌ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ.40లక్షల రుణం తీసుకున్నారు. ఆ రుణంతో గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించుకొని ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అందులోనే ఒక గదిలో ఆమె నివసించేవారు. బ్యాంకులో పనిఒత్తిడి కారణంగా ఇబ్బందిగా ఉంటోందని ఇటీవల ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు తెలపగా వారు ఆమెను సముదాయించి పంపారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేశాయి. శనివారం విధులు ముగించుకుని బ్యాంకు నుంచి వచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం అద్దెకు ఉంటున్న వ్యక్తి చూసే సమయానికి ఓ గదిలో సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపగా వారు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సాయంత్రానికి గుళ్లపల్లి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి తండ్రి లక్ష్మీనారాయణ, అన్న రామకృష్ణ ఉన్నారు.

సిరిసిల్లలో విషాదం

సిరిసిల్ల పట్టణంలోని గణేష్‌ నగర్‌కు చెందిన బొల్లి లక్ష్మినారాయణ-విమల దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్‌, రామకృష్ణ, ఒక కూతురు దివ్యవాణి సంతానం. లక్ష్మినారాయణ సాంచలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి విమల బీడీ కార్మికురాలు. ఇద్దరు కుమారులకు వివాహమైంది. పెద్ద కుమారుడు సిరిసిల్లలోనే టైలరింగ్‌ చేయగా, చిన్నకుమారుడు సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తూ సిరిసిల్లలోనే ఉంటున్నాడు. దివ్యవాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని