Andhra News: విశాఖలో వధువు సృజన మృతి కేసు.. వీడిన చిక్కుముడి!

విశాఖపట్నంలోని మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు

Updated : 23 May 2022 11:33 IST

మధురవాడ: విశాఖపట్నంలోని మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పొగొట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సృజన ఫోన్‌లో కాల్‌ డయల్‌ రికార్డర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

విశాఖ నగరంలోని పరవాడకు చెందిన తోకాడ మోహన్‌ అనే యువకుడితో ఏడేళ్లుగా సృజనకు ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో వాళ్లు చేస్తున్న పెళ్లి తనకు ఇష్టం లేదని.. తీసుకెళ్లాలని మోహన్‌ను సృజన కోరింది. ఆర్థికంగా తాను ఇంకా స్థిరపడలేదని.. సరైన ఉద్యోగం లేదంటూ పెళ్లికి మోహన్‌ నిరాకరిస్తూ వచ్చాడు. కొంత సమయం నిరీక్షించాలని సృజనను కోరాడు.

ఈ క్రమంలో సృజనకు కుటుంబసభ్యులు ఈనెల 11న వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ పెళ్లి ఇష్టం లేని సృజన.. దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తానని మోహన్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆమె విషపదార్థం తీసుకుంది. కానీ ఊహించని రీతిలో పెళ్లిపీటలపైనే కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ కేసు వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సాయంత్రం విశాఖ పోలీసు అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలపనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు