Updated : 27 May 2022 13:29 IST

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మనోహరాబాద్‌ మండలం కూచారం రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ డేవిడ్‌రాజ్‌ తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం వేలూర్‌ గ్రామానికి చెందిన సత్తయ్య, రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. 20 ఏళ్ల కిందట మనోహరాబాద్‌ మండలం కూచారం గ్రామానికి ఉపాధి నిమిత్తం వచ్చారు. సత్తయ్య ట్రాక్టరు డ్రైవరు కాగా, రేణుక పరిశ్రమలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు, కూతురికి వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు హరీశ్‌ (21) తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెకు వివాహం జరిగింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హరీశ్‌ గురువారం ఉదయం 9 గంటల సమయంలో కూచారం రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన పలువురు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రైల్వే పోలీసులకు విషయం తెలియజేయగా వారొచ్చి పరిశీలించగా.. హరీశ్‌ అని తేలింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం గాంధీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని హెడ్‌కానిస్టేబుల్‌ వివరించారు.


ఆర్థిక ఇబ్బందులతో..

మోమిన్‌పేట: ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోమిన్‌పేట ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్‌ప్రకాష్‌ తెలిపిన వివరాలు.. మోమిన్‌పేటకు చెందిన బేగరి మహిపాల్‌(28) బుధవారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని భార్య శిరీషతో చెప్పి వెళ్లాడు. కొంతసేపటి తరువాత శిరీష తన మరిది అనిల్‌ చరవాణితో ఫోన్‌ చేయగా బస్టాండ్‌ దగ్గరే ఉన్నాను వస్తున్నానని చెప్పాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో మళ్లీ ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో తెలిసిన వారి వద్ద వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం కాస్లాబాద్‌ సమీపంలోని నందివాగు ప్రాజెక్టు పరిసరాల ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నట్టు గుర్తించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పులు ఉన్నాయని తరచూ బాధపడుతుండేవాడని శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


జీవితంపై విరక్తితో..

గడ్డపోతారం(జిన్నారం): జీవితంపై విరక్తితో ఓ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిన్నారం మండలం గడ్డపోతారంలో చోటుచేసుకుంది. ఐడీఏ బొల్లారం పోలీసుల కథనం ప్రకారం... గడ్డపోతారం శివారులోని విశ్వనాథ్‌ వెంచర్‌లో అద్దె ఇంట్లో ఉండే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మన్ను అన్సారీ(24) కొంత కాలంగా పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts