వివాహ వేడుక.. విషాద గీతిక

ఎంతో సంతోషంగా వివాహానికి బయలుదేరారు వారు.. మరో పది నిమిషాల్లో కల్యాణ మండపానికి చేరుకొని పెళ్లి వేడుకలో సరదాగా

Updated : 27 May 2022 05:57 IST

అయిదుగురిని కబళించిన మృత్యువు

15 మందికి గాయాలు

చింతలమడలో మిన్నంటిన రోదనలు

బందరులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఎంతో సంతోషంగా వివాహానికి బయలుదేరారు వారు.. మరో పది నిమిషాల్లో కల్యాణ మండపానికి చేరుకొని పెళ్లి వేడుకలో సరదాగా గడపాల్సిన వారిని మార్గమధ్యలో రహదారి ప్రమాదం రూపంలో విధి వక్రీకరించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాలీ ఆటో ప్రమాదానికి గురై అయిదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన హృదయవిదారకర సంఘటన గురువారం మధ్యాహ్నం మోపిదేవి సమీపంలోని కాసానగర్‌ వద్ద చోటుచేసుకుంది. చల్లపల్లి మండల లక్ష్మీపురం పంచాయతీ చింతలమడ గ్రామానికి చెందిన పల్లి సంధ్యారాణి వివాహం మోపిదేవి మండలం పెదప్రోలులో గూడపాటి నాగశ్రీనివాసరావుతో గురువారం జరగాల్సి ఉంది. బంధువులంతా ట్రక్కు వాహనంలో పెదప్రోలు వస్తుండగా వాహనం అదుపు తప్పడంతో రెక్కాడితేగానీ డొక్కాడని ఒకే గ్రామానికి చెందిన అయిదుగుర్ని మృత్యువు కబళించి అయిదు కుటుంబాల్లో అంతులేని విషాధం నింపింది. ప్రమాదంలో గాయపడిన 16మందిని బందరు ఆసుపత్రికి తీసుకు రాగా క్షతగాత్రులతో పాటు వారివెంట వచ్చిన కుటుంబసభ్యుల రోదనలతో బందరు ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిలో నలుగురిని మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించారు. డీసీహెచ్‌ జ్యోతిర్మణి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జయకుమార్‌, ఆర్‌ఎంవో కృష్ణదొర తదితరులు దగ్గరుండి వైద్యచికిత్స అందిస్తున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్‌, ఆపై అతి వేగం..!

డ్రైవరు మద్యం మత్తులో ఉంటూ అతివేగంగా నడపడం వల్లే వాహనం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. చల్లపల్లిలో వాహనం ఆగిన సమయంలో డ్రైవరు మద్యం తాగి వచ్చినట్లు క్షతగాత్రుల్లో కొందరు తెలిపారు. పెళ్లి ముహూర్తానికి సమయం మించిపోతుండడంతో డ్రైవర్‌ వేగం పెంచాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. వాహనంలో ఉన్న వారికి రహదారి పక్కనున్న చెట్టుకు కొందరి తలలు బలంగా తగిలి తీవ్రంగా గాయపడ్డారు. చల్లపల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని వారిని చల్లపల్లి, అవనిగడ్డ ఆస్పత్రులకు పంపారు. మిగిలిన క్షతగాత్రుల్ని మూడు 108 వాహనాల్లో బందరు ఆస్పత్రికి తరలించారు.


మృతులు వీరే..

* ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్రం విజయకుమారి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం కాగా కొడుకులు హైదరాబాద్‌లో చిరు ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. కూలి పనులతో వచ్చే సొమ్ముతో కుమార్తె, భర్తతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఆమె మృతితో ఆ కుటుంబం ఆసరా కోల్పోయింది.


* బూరేపల్లి రమణ భర్త పెదశివాజీతో కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది. కుమారుడు చిరు ఉద్యోగం చేస్తుండటంతో ఉన్నంతలో కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్న రమణ మరణించడంతో ఆ ఇంటికి దీపం పెట్టేవారు కరవయ్యారు.


* బూరేపల్లి వెంకటేశ్వరమ్మ కూడా కూలి పనులకెళ్తూ ముగ్గురు కుమారులతో సంతోషంగా జీవిస్తోంది. భర్త ఇదివరకే మృతి చెందాడు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యువాత పడగా ఆమె సంతానం ఆసరా కోల్పోయారు. కుమారుల రోదన ఆ ప్రాంత వాసులను కదిలించింది.


* కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కోన వెంకటేష్‌ దుర్మరణం చెందడంతో ఆ కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. వృద్ధురాలైన వెంకటేష్‌ భార్య ఆరోగ్యం తమ పిల్లలకు పెద్దను కోల్పోయామని కన్నీటిపర్యంతమైంది.


* మద్దాల మాధవరావు చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా భార్య బాలతో జీవిస్తుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందడంతో భార్య దిక్కులేని పరిస్థితిలో ఉన్నది.


ఏమైందో గుర్తులేదు: ప్రభావతి మాగ్రామానికి చెందిన 20మంది వాహనంలో మోపిదేవి మండలం పెదప్రోలు వెళ్తున్నాం. వాహనంలో కొందరు నిలబడి ఉంటే మరికొందరు కూర్చుని ఉన్నారు. అది ఏ ఊరో కూడా తెలియదు. ఒక్కసారిగా వాహనం పడిపోయింది. ఆ తరువాత ఏమయిందో గుర్తుకు రావడం లేదు. ప్రమాదానికి గురైన వారిలో అందరూ బంధువులే. ఎవరికి ఎలా ఉందో కూడా చెప్పడం లేదు. నాకు ప్రస్తుతానికి ఫర్వాలేదు. నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. లేవలేని స్థితిలో ఉన్నా.


5 నిమిషాల్లో గమ్యానికి: వెంకటేశ్వరమ్మ అందరం వాహనంలోనే ఉన్నాం. ఇంకా 5 నుంచి 10 నిమిషాల్లోపే గమ్యానికి చేరుకుంటాం. ఈ లోపే ప్రమాదం జరిగిపోయింది. ఎలా పడిపోయామో...ఎవరికి ఏం జరిగిందో కూడా తెలియదు. నా చేతికి గాయాలయ్యాయి. వైద్యులు చికిత్స అందించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి.


సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న స్థానికులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని