Andhra News: స్నేహితుడని క్రెడిట్‌ కార్డులిస్తే.. రూ.50 లక్షలకు టోకరా

స్నేహితుడిని నమ్మి క్రెడిట్‌ కార్డులనిస్తే రూ.50 లక్షలు మోసానికి పాల్పడ్డ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. ప్రసాదంపాడుకు చెందిన వాడవల్లి

Published : 27 May 2022 07:02 IST

కృష్ణలంక, న్యూస్‌టుడే: స్నేహితుడిని నమ్మి క్రెడిట్‌ కార్డులనిస్తే రూ.50 లక్షలు మోసానికి పాల్పడ్డ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. ప్రసాదంపాడుకు చెందిన వాడవల్లి సాయి స్వప్నకుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇంటి వద్దనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన యర్రంశెట్టి వీరవెంకట నాగకిరణ్‌ 2018లో పలు బ్యాంకులకు చెందిన 15 క్రెడిట్‌ కార్డులను స్వప్నకుమార్‌ నుంచి తీసుకున్నారు. వాటిని నాగకిరణ్‌.. తన స్నేహితులైన యడ్ల వసుధ, ఆమె కుమారులు ఉదయ్‌కుమార్‌, క్రాంతి కుమార్‌లకు ఇవ్వగా.. ఆ కార్డులు ఉపయోగించి వారు విదేశీ కళాశాలలకు ఫీజులు చెల్లింపులు చేపట్టారు. వారితో పాటు నాగకిరణ్‌ స్నేహితులైన రాజ్యలక్ష్మి, విజయ్‌కుమార్‌లు కూడా తమ అవసరాలకు రూ.9 లక్షలు ఈ కార్డుల ద్వారా వాడుకున్నారు. ఇలా పలు దఫాలుగా ఈ కార్డుల ద్వారా తీసుకున్న మొత్తం రూ.50 లక్షలకు చేరింది. మరోపక్క తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుల రికవరీ టీం సభ్యులు స్వప్నకుమార్‌పై ఒత్తిడి చేయసాగారు. దీంతో చెల్లింపు చేపట్టాల్సిందిగా అతడు నాగకిరణ్‌ను అడగ్గా రెండేళ్లుగా తాత్సారం చేస్తున్నాడు. దీంతో బాధితుడు స్వప్నకుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి నాగకిరణ్‌ తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించగా ఆమె తనకేమీ తెలియదని ఇద్దరూ మాట్లాడుకోవాల్సిందిగా సూచించారు. ఇద్దరికి స్నేహితుడైన వేరొకరి ద్వారా అడిగితే నాగకిరణ్‌ విజయవాడలో ఎవరికైనా తన గురించి చెప్పుకోవచ్చని, తనకు జైలు కొత్త కాదని, తనపై ఎటువంటి కేసైనా పెట్టుకోవచ్చంటూ బెదిరిస్తూ మాట్లాడాడు. దీంతో బాధితుడు స్వప్నకుమార్‌ ఈ నెల 22న స్పందన కార్యక్రమంలో సీపీకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు పటమట పోలీసులు నిందితుడు నాగకిరణ్‌పై బెదిరింపు, మోసం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని