చెట్టుకు కట్టేసి దళిత యువకుడిపై దాడి

విశాఖ జిల్లా పెందుర్తి మండలం వి.జుత్తాడలో అమానుషం చోటుచేసుకుంది. ఒక దళిత యువకుడిని మరో దళిత వ్యక్తి చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది.

Updated : 09 Jun 2022 06:34 IST

విశాఖ జిల్లా వి.జుత్తాడలో అమానుషం


దళిత యువకుడిని చెట్టుకు కట్టేసి చెప్పుతో కొడుతున్న దృశ్యం

పెందుర్తి, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా పెందుర్తి మండలం వి.జుత్తాడలో అమానుషం చోటుచేసుకుంది. ఒక దళిత యువకుడిని మరో దళిత వ్యక్తి చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. పెందుర్తి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వి.జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు, సూరిబాబు గ్రామంలోని ఓ వైకాపా నాయకుడికి ముఖ్య అనుచరులు. వారం క్రితం తారకేశ్వరరావు మద్యం తాగి వైకాపా నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు. మర్నాటి ఉదయం తన సెల్‌ఫోన్‌ దొంగిలించాడన్న ఆరోపణతో తారకేశ్వరరావును సూరిబాబు చెట్టుకు కట్టి చెప్పుతో కొట్టి, అసభ్య పదజాలంతో దూషించాడు. వైకాపా నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. సూరిబాబును చంపేస్తానని తారకేశ్వరరావు బెదిరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. సూరిబాబు కూడా తారకేశ్వరరావుపై కేసు పెడతానని హెచ్చరించినట్లు  తెలిసింది. దాంతో పాత ఘటన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన స్థానిక ఎంపీటీసీ సభ్యుడి ఇంటి సమీపంలోనే జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే దాడి: సీఐ

తన సెల్‌ఫోన్‌ను తారకేశ్వరరావు దొంగిలించాడనే సూరిబాబు అతడిని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పెందుర్తి సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. వీడియో కలకలం రేపిన నేపథ్యంలో గ్రామంలో విచారణ చేశామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని