ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూలు

కొలువులు ఇప్పిస్తానని జలవనరుల శాఖలో పని చేస్తున్న ఏఈ నిరుద్యోగులను నిలువునా ముంచారు. పలువురి వద్ద రూ.50 లక్షల వరకు వసూలు చేశాడు. నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నందవరం మండలం మాచాపురానికి చెందిన ఎ

Updated : 25 Jun 2022 05:03 IST

రూ.50 లక్షలకు టోకరా వేసిన ఏఈ


ఎ.శంకర్‌, ఏఈ

నందవరం, ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కొలువులు ఇప్పిస్తానని జలవనరుల శాఖలో పని చేస్తున్న ఏఈ నిరుద్యోగులను నిలువునా ముంచారు. పలువురి వద్ద రూ.50 లక్షల వరకు వసూలు చేశాడు. నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నందవరం మండలం మాచాపురానికి చెందిన ఎ.శంకర్‌ గురురాఘవేంద్ర ప్రాజెక్టులో ఏఈగా పని చేస్తున్నాడు. తమ శాఖలో త్వరలో ఉద్యోగ ప్రకటన వెలువడుతుంది.. డబ్బులిస్తే ఉద్యోగం కచ్చితమని నమ్మబలికాడు. గ్రామానికి చెందిన ఉత్తేజనాయుడు, మోహన్‌కుమార్‌తోపాటు మరికొందరు ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు డబ్బులిచ్చారు. ఇలా రూ.అరకోటికి పైగా వసూలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగమంటూ కొందరు నిరుద్యోగులకు నకిలీ ఉద్యోగపత్రం ఇచ్చి చేర్పించాడు. అక్కడ కొన్ని నెలలు పనిచేసినా వేతనం రాకపోవడంతో నిరుద్యోగులు తిరిగొచ్చారు. మరికొందరికి పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు.. ఇతర అంశాలపై సర్వే చేసి నివేదిక ఇచ్చే ఉద్యోగమని చెప్పాడు. పాఠశాలకు సర్వే చేసేందుకు వెళ్తే అక్కడ ఉపాధ్యాయులు ఐడీ కార్డు చూపాలని చెప్పడంతో తాము మోసపోయామని నిరుద్యోగులు గ్రహించారు.

న్యాయం చేయాలి

- ఉత్తేజ్‌ నాయుడు, మాచాపురం

మాది నందవరం మండలం మాచాపురం. ఉద్యోగం ఇప్పిస్తానంటే రూ.6 లక్షలు చెల్లించా. తర్వాత ఉద్యోగం అడిగితే కాలయాపన చేస్తున్నాడు. అడిగిన ప్రతిసారి ఏదో సాకు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని న్యాయం చేయాలని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశా.

సంబంధం లేదన్నాడు

- మోహన్‌, మాచాపురం

మాది మాచాపురం. 2020 మార్చిలో ప్లానింగ్‌ డిపార్ట్‌మెంటులో ఉద్యోగమని చెప్పి పంపించాడు. తొమ్మిది నెలలు ఉద్యోగం చేసినా వేతనాలు అందలేదు. ఈ విషయంపై కార్యాలయంలో అడిగితే, మమ్మల్ని ఎవరు పంపించారో వారినే జీతాలు అడగమన్నారు. శంకర్‌ను ప్రశ్నించగా వేతనాల గురించి నాకు సంబంధం లేదన్నాడు. ఈ విషయంపై నందవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని