Updated : 26 Jun 2022 05:00 IST

బీపీఎం కుమారుడి మాయాజాలం

ఉపాధి కూలీల డబ్బులు స్వాహా.. దేహశుద్ధి చేసిన స్థానికులు

బీపీఎం నుంచి గ్రామస్థులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు

నేరెడుగొమ్ము - దేవరకొండ, న్యూస్‌టుడే:   నిరక్షరాస్యులు, నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నూతన అకౌంట్ల పేరుతో అకౌంట్‌లో ఉన్న డబ్బులు స్వాహా చేసిన ఘటన నేరెడుగొమ్ము మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, సర్పంచి తెలిపిన వివరాల ప్రకారం... గుడిపల్లి పోస్టాఫీసుకు చెందిన బీపీఎం ఎస్‌.కె.జహంగీర్‌ మండలంలో ఉపాధి కూలీలకు తపాలా కార్యాలయం అకౌంట్లు తెరుస్తానని ఎంపీడీవో దగ్గరి నుంచి అనుమతి తీసుకున్నారు. బ్యాంక్‌ ఖాతా లేని ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ వద్ద పోస్టాఫీసు సిబ్బందితో నూతన ఖాతా తెరుచుకోవాలని ఆయా పంచాయతీల సిబ్బంది సూచించారు. మండలంలోని బచ్చాపురంలో 130, పెద్దమునిగల్‌లో 175, నేరెడుగొమ్ములో 250 ఖాతాలను ఉపాధి కూలీలకు జహంగీర్‌ కుమారుడు అప్రోజ్‌ కొద్ది రోజులుగా తీయించారు. ఒక్కో ఖాతా నుంచి రూ.200 నుంచి రూ.250 వసూలు చేస్తూ నగదు మీ ఖాతాలోనే ఉంటాయని నమ్మించి వేలి ముద్రల సాయంతో రూ.180 వరకు స్వాహా చేశారు. అంతేకాకుండా నేరెడుగొమ్ములో ఇద్దరి ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు స్వాహా చేయడంతో గుర్తించిన సదరు ఖాతా దారులు అప్రోజ్‌ను ప్రశ్నించారు. భయాందోళనకు గురైన అప్రోజ్‌ గుట్టుచప్పుడు కాకుండా వారి నగదును ముట్టజెప్పి విషయం బయటికి రాకుండా చూసుకున్నారు. కాగా శనివారం తిమ్మాపురం 110 ఖాతాలను తీయగా వారి ఖాతాల్లో నుంచి కూడా నగదు మాయం అవుతుందని గుర్తించిన ఉపాధి కూలీల పిల్లలు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. అదే గ్రామంలోని కోనేటి రజిత అకౌంట్‌ నుంచి రూ.1,500, బోడ బుచ్చయ్య అకౌంట్‌ నుంచి రూ.1,900, బోడ ఆంజనేయులు అకౌంట్‌ నుంచి రూ.2,500 తన వ్యక్తిగత ఖాతాలకు దారి మళ్లించినట్లు గుర్తించారు. హుటాహుటిన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వెళ్లగా అప్పటికే అక్కడే ఉన్న అప్రోజ్‌ను నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 665 నూతన ఖాతాలు తెరవగా, సుమారు రూ.3.5 లక్షలు నగదు దారి మళ్లినట్లు గుర్తించారు. దీంతో గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేసి కంప్యూటర్‌, బయోమెట్రిక్‌ డివైజ్‌, అతను కూలీల నుంచి వసూలు చేసిన డబ్బులు స్వాధీనం చేసుకొని పరికరాలను, డబ్బులను సర్పంచి భద్రపర్చారు. బీపీఎం కుమారుడు జరిగిన సంఘటనను తండ్రికి వివరించడంతో తండ్రి జహంగీర్‌ హుటాహుటిన గ్రామానికి చేరుకొని పెద్ద మనుషులతో రాజీ కుదుర్చుకునేందుకు బేరసారాలు జరిపారు. గ్రామస్థులు ససేమిరా అనడంతో అక్కడి నుంచి జారుకున్నారు.


చర్యలు తీసుకుంటాం

ఝాన్సిలక్ష్మిబాయి, ఎంపీడీవో

బీపీఎం అక్రమాలకు పాల్పడినట్లు తిమ్మాపురం గ్రామం నుంచి సమాచారం అందింది. వెంటనే అతనిపై కేసు పెట్టాలని గ్రామ సర్పంచి కుంభం కేశవులుకు సూచించా.


 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని